రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు

15 Nov, 2018 04:47 IST|Sakshi
వివిధ రంగుల్లోని కొత్త చిహ్నం

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

సాక్షి, అమరావతి: ఇప్పటివరకు అమల్లో ఉన్న రాష్ట్ర అధికారిక చిహ్నంలో.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అమరావతి శిల్ప కళలోని ధమ్మ(ధర్మ) చక్రాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ సరికొత్త చిహ్నాన్ని రూపొందించింది. అందమైన ఆకుల మధ్య త్రిరత్నాలు(బుద్ధుడు, ధర్మం, సంఘం), అత్యంత విలువైన రత్నాలు పొదిగించిన దండతో ధర్మచక్రాన్ని చిహ్నంలో ఏర్పాటు చేశారు. క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో ధాన్యకటకంలో చైత్యానికి విధుకుడు అనే చర్మకారుడు బహూకరించిన పున్నఘటక(పూర్ణఘటం)ను మూడు వృత్తాల్లో వరుసగా 48, 118, 148 ముత్యాలతో అలంకరించారు. ధర్మచక్రం మధ్యలో నాలుగు పీటల దండల మధ్య పున్నఘటకను ఏర్పాటు చేశారు. పున్నఘటక చిహ్నం కింద జాతీయ చిహ్నం(సారనాథ్‌లో దొరికిన అశోక స్థంభం) బొమ్మ ఉంది.

ఇప్పటివరకు ఆంగ్లంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్న పదాన్ని తెలుగులో చిహ్నంలో అగ్ర భాగంలోనూ.. అదే పదాన్ని ఎడమ వైపున ఆంగ్లంలోనూ, కుడి వైపున హిందీలోనూ ఏర్పాటు చేశారు. దిగువ భాగాన సత్యమేవ జయతే అన్న పదాన్ని తెలుగులోకి మార్పు చేశారు. ఈ చిహ్నాన్ని మూడు రూపాల్లో ముద్రించుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర చిహ్నాన్ని ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు, సీఎస్, ప్రభుత్వ కార్యదర్శులు, అడ్వొకేట్‌ జనరల్, శాఖల అధిపతులు, కలెక్టర్లు, సచివాలయంలోని మధ్యస్థాయి అధికారులు వినియోగించుకోవచ్చు. 

మరిన్ని వార్తలు