పోలీసుల అదుపులో మోసగాడు

18 Jan, 2014 02:33 IST|Sakshi

సాక్షి, సిటీ బ్యూరో: భార్యను మోసం చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని మహిళా ఠాణా పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువతికి అనంతపురం వాసి ఆర్.వంశీకృష్ణతో 2009లో వివాహమైంది. ఇతడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగని చెప్పడంతో ఆ సమయంలో యువతి కుటుంబీకులు భారీగా కట్నకానుకలు ఇచ్చారు. వీరికి ఒక పాప పుట్టింది. ఆ తర్వాత వంశీకృష్ణ భార్యను వేధించడం మొదలెట్టాడు. ఆమె నుంచి దాదాపు రూ.50 లక్షల నగదు తీసుకొని ఖర్చు చేశాడు.
 
 అంతేకాకుండా 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఒక ప్లాటు అమ్మేశాడు. వంశీ సోదరికి పిల్లలు లేకపోవడంతో మగపిల్లాడిని దత్తత ఇవ్వాలని భావించాడు. బయట వారి పిల్లలను దత్తత ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో తనకు పుట్టిన వారినే ఇద్దామని నిర్ణయించుకున్నాడు. అప్పటికే ఇతడికి జగద్గిరిగుట్టకు చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఉండటంతో ఆమె ద్వారా బాలుడికి జన్మనిచ్చాడు. ఈ మేరకు నగరంలోని జీహెచ్‌ఎంసీ నుంచి ధ్రువీకరణ తీసుకున్నాడు.
 
 అయితే నిబంధనల ప్రకారం దత్తత ఇవ్వాలంటే తన భార్యకు పుట్టిన బిడ్డ మాత్రమే అయి ఉండాలని తెలిసి.. ప్రియురాలికి పుట్టిన మగపిల్లాడు తన భార్యకే పుట్టినట్టు అనంతపురంలో నమోదు చేయించి ధ్రువీకరణ పత్రం తీసుకున్నాడు. ఇటీవల కాలంలో వంశీ నుంచి వేధింపులు పెరగడంతో అతడి భార్య అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చేసింది. ఈ బర్త్‌సర్టిఫికెట్ల విషయం ఆమెకు తెలిసి న్యాయవాది కె.శేతకర్ణి సహకారంతో మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం వంశీని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు