సీఎంతోఆ ముగ్గురు

12 Sep, 2013 01:08 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్ :  వారు జిల్లాకు సుపరిచితులు కాదు. అధికారపార్టీలో కీలకమైన పదవులేమీ లేవు. రాజకీయాల్లోనూ అంతగా అనుభవం లేదు. కానీ.. ఆ ముగ్గురు ఏకంగా ముఖ్యమంత్రి కోటరీలోనే చేరిపోయారు.  సీఎం కిరణ్‌కు ప్రధాన అనుచరులుగా, అంతరంగికులుగా... రకరకాల హోదాల్లో రాజధానిలో స్థిరపడ్డారు. క్లాస్‌మేట్లు... క్రికెట్ అనుబంధం... పాత పరిచయాలు, రాజకీయ వారసత్వ సంబంధాలు... కారణమేదైతేనేం సాక్షాత్తూ సీఎం క్యాంప్ ఆఫీసునే కేరాఫ్ అడ్రస్‌గా మలుచుకున్నారు. ఆయనకు సన్నిహితులనే ముద్ర వేసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మించి.. సీఎం క్యాంపు కేంద్రంగా ఆ ముగ్గురి మాటే చెల్లుబాటవుతోంది. ఆ ముగ్గురిలో ఒకరు జిల్లా రాజకీయాలను సైతం శాసించే స్థాయికి ఎదిగారు. అందుకే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఆయన పేరునే  జపిస్తున్నారు. నామినేటేడ్ పదవులు మొదలు పైరవీలన్నీ ఆయనను ప్రసన్నం చేసుకుంటే సరిపోతుందని ఆ పార్టీ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఇంతకు ఎవరా ముగ్గురు అంటే..
 
ఒకరు మాజీ ఎంపీ కుమారుడు

రఘురామ్‌రెడ్డి. ఈయన వరంగల్ మాజీ ఎంపీ రామసాయం సురేందర్‌రెడ్డి కుమారుడు. డోర్నకల్ నియోజకవర్గంలోని మ రిపెడ స్వస్థలం. కొన్నేళ్ల కిందటే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. చిన్నప్పటి సీఎం క్లాస్‌మేట్. మార్నింగ్ వాకింగ్ మిత్రునిగా రఘురామ్.. సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితుని జాబితాలో చేరిపోయారు. తండ్రి ఎంపీగా ఉన్నంత కాలం ఎన్నికల ప్రచారానికి తప్ప రఘురామ్‌రెడ్డికి రాజకీయాలు పెద్దగా తెలియదు. ఇప్పటివరకు పార్టీలోనూ ఎలాంటి పదవులు చేపట్టలేదు. కిరణ్  సీఎం అయ్యాక అనూహ్యంగా రఘురామ్ హవా మొదలైంది. జిల్లా రాజకీయాలను సైతం మలుపు తిప్పే స్థాయికి ఎదిగారు. ఇటీవల డీసీఎంఎస్ చైర్మన్ నియామకంలోనూ ఆయనే చక్రం తిప్పినట్లు ప్రచారం జరిగింది. జిల్లాకు సంబంధించిన వ్యవహారాలన్నింటా ఆయన మాటే సీఎం దగ్గర చెల్లుబాటవుతుం దని బాహాటంగా ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. సీ ఎంకు సన్నిహితుడు కావటంతో తెలంగాణ ఉద్యమ సమయంలోనే రఘురామ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది.
 
మరొకరు క్రికెట్ దోస్త్

ఇనుగాల వెంకట్రాంరెడ్డి. పరకాల నియోజకవర్గం ఆత్మకూరుకు చెందిన దేశాయి వారసుడు. కొన్నేళ్ల కిందటే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కొంతకాలం ఓ ఇంగ్లిష్ మీడియాలో డెరైక్టర్‌గా వ్యవహరించారు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. హైదరాబా ద్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. క్రికెట్‌తో ఉన్న అనుబంధంతోనే సీఎంకు దగ్గరయ్యారని ప్రచారంలోకి వచ్చింది. క్రమంగా సీఎంకు సన్నిహితుని హోదాలో ఉన్నారు. ఆత్మకూరులో ఇనుగాల ట్రస్ట్ స్థాపించి రోడ్లు, బోర్లు ఏర్పాటు చేయిం చాడు.  స్వయానా సీఎం అండతో డీసీసీబీ చైర్మన్ పదవిని ద క్కించుకునేందుకు ఇటీవలే జిల్లాలో అడుగుపెట్టారు. ఫిబ్రవరి లో జరిగిన సహకార ఎన్నికల్లో ఆత్మకూరు పీఏసీఎస్ డెరైక్టర్‌గా గెలిచారు. రకరకాల ఎత్తులు వేసినా మెజారిటీ లేకపోవడంతో చైర్మన్ పదవి చేజారింది. దీంతో డీసీసీబీ రేసులో భంగపడ్డారు. సొసైటీ చైర్మన్‌గా గెలిస్తే సీఎం అండతో చైర్మన్ సీటు ఆయనకు దక్కేదని పార్టీ శ్రేణులు బాహాటంగానే ధ్రువీకరించాయి.
 
ఇంకొకరు గాంధీభవన్ మిత్రుడు

 పదిహేనేళ్ల పాటు గాంధీభవన్ దగ్గర దోస్తానా... జిల్లాకు చెందిన బండి సుధాకర్‌గౌడ్‌ను సీఎంకు దగ్గర చేసింది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నా.. ఢిల్లీకి వెళ్లినా సుధాకర్ సీఎం వెంటే ఉంటున్నారు. అంగరక్షకులకు మించి సీఎం అపాయింట్‌మెంట్ కావాలనుకున్న వారందరికీ సుధాకర్ తారసపడటం తప్పనిసరైంది. వర్ధన్నపేట నియోజకవర్గంలోని పంథిని మాజీ సర్పంచిగా పనిచేసిన సుధాకర్ గతంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అంతకు మించి పదవులు.. హోదాలేమీ లేవు. కిరణ్‌కుమార్ సీఎం అయ్యాక సుధాకర్ ఏకంగా హైదరాబాద్‌కు తన మకాం మార్చారు. తనతో ఉన్న అనుబంధంతోనే ఇటీవల సీఎం ఆయనను ఇందిరమ్మ బాటకు మీడియా ఇన్‌చార్జిగా నియమించారు. నామినేటేడ్ పదవుల్లో ఏదో ఒకటి.. ఆయనను వరించి వస్తుందని జిల్లా పార్టీలోనూ చర్చ జరుగుతోంది.
 

>
మరిన్ని వార్తలు