ఎమ్మెల్సీ ఎన్నికలపై బాబు సమాలోచన!

19 Jan, 2015 02:42 IST|Sakshi
ఎమ్మెల్సీ ఎన్నికలపై బాబు సమాలోచన!

‘పశ్చిమ’కు వెళుతూ మధురపూడిలో ఆగిన సీఎం
     ఎన్నికల సమన్వయకర్తగా ఉప ముఖ్యమంత్రి రాజప్ప!
 
 సాక్షి, రాజమండ్రి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధురపూడి విమానాశయంలో ఆదివారం  ఉదయం కొద్దిసేపు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమాలోచన జరిపినట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్నులో స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ప్రారంభానికి వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం 10.25 గంటలకు ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి      చేరుకున్నారు. అక్కడి నుంచి 10.40 గంటలకు హెలికాప్టర్‌లో వేలివెన్ను వెళ్లారు. ఆయనకు విమానాశ్రయంలో జిల్లా నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
 
 ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ చైతన్యరాజు, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, ఇతర నేతలు ముఖ్యమంత్రిని విమానాశ్రయం లోపల కలుసుకున్నారు. వారితో చంద్రబాబు 15 నిముషాల పాటు మాట్లాడారు.  తెలిసిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలను ఆరా తీశారు. గతంలో ఉన్న ఓట్లు, ఇప్పుడు పెరిగిన ఓట్లు, గతంలో చైతన్యరాజుకు పోలయిన ఓట్ల వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికలకు సమన్వయకర్తగా వ్యవహరించాలని చినరాజప్పను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంపై మాట్లాడేందుకు సోమవారం నిడదవోలు రావాల్సిందిగా ముఖ్య నేతలను చంద్రబాబు ఆహ్వానించారు. విమానాశయం వద్ద ముఖ్యమంత్రిని కలిసిన అధికారుల్లో జేసీ సత్యనారాయణ, అర్బన్ ఎస్పీ హరికృష్ణ, రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయరామరాజు తదిత రులున్నారు.  
 
 పల్లెల అభివృద్ధికే ‘స్మార్ట్ విలేజ్’ : చినరాజప్ప
 రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పల్లెలను స్మార్ట్‌గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని హోం మంత్రి చినరాజప్ప అన్నారు. ముఖ్యమంత్రి వేలివెన్ను బయల్దేరాక ఆయన విమానాశ్రయం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ పిలుపు స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి తమ నేత పూనుకున్నారన్నారు. తాను పెద్దాపురం మండలం జె.తిమ్మాపురాన్ని దత్తత తీసుకున్నానని, జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని స్మార్ట్ పల్లెలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ జరుగుతోందని చెప్పారు. అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి పారిశుద్ధ్యం, విద్యాభివృద్ధి, రోడ్లు, డ్రైన్‌లు తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. గ్రామాల ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలని పిలుపునిచ్చారు. దివంగత నేత ఎన్టీ రామారావు పార్టీలకు అతీతంగా ప్రజల అభివృద్ధికి పాటు పడ్డారని, ఆయన 19వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను మననం చేసుకుంటున్నామని చెప్పారు.  
 
 విమానాశ్రయంలో భారీ పోలీసు బందోబస్తు
 కోరుకొండ : ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో మధురపూడి విమానాశ్రయం వద్ద, పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేశారు. కాగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, ప్రభుత్వాధికారులు సీఎంకు స్వాగతం పలికారు. విమానం దిగి, తిరిగి హెలికాప్టర్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లే లోగా సీఎం జిల్లానేతలతో భేటీ అయ్యారు.
 
 

మరిన్ని వార్తలు