సీఎం హామీని అమలుచేసేంత వరకు పోరాటం

29 Jul, 2015 00:36 IST|Sakshi

విజయనగరం క్రైం: ఎన్నికల ముందు  మహిళలకు ఇచ్చిన  డ్వాక్రా రుణమాఫీని  అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామని ఐద్వా రాష్ట్ర  అధ్యక్షురాలు బి.ప్రభావతి హెచ్చరించారు. పట్టణంలోని ఎన్జీఓ హోంలో డ్వాక్రా మహిళల సమస్యలపై మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న  ఆమె మాట్లాడు తూ ప్రతి ఇంట్లో సంతోషం నింపుతా,  ప్రతి పొదుపు మహిళ తీసుకున్న రుణాలు వడ్డీతో కలిపి మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో వాగ్దానం చేశారన్నారు.
 
   కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయతీలు ఇస్తారు కానీ డ్వాక్రా  మహిళలు కష్టపడి కడుపుకట్టుకొని పొదుపుచేసే సోమ్ముకు మాత్రం వడ్డీ ఇవ్వడం లేదన్నారు.  ఒకవైపు పెరిగిన ధరలు, మరోవైపు భర్త తెచ్చిన ఆదాయం మద్యానికి పోవడం, ఇంకో వైపు వడ్డీలకు అప్పులు తెచ్చి బ్యాంకుకు కట్టడం కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత  కూడా మహిళలపైనే పడడంతో పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా ఈ పథకం పరిస్థితి తయారైందన్నారు. అభయహస్తం కనీసం వెయ్యి రూపాయలు ఇవ్వాలని మహిళలు కోరుతున్నారన్నారు. హింస పెరగడానికి కారణమైన మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తూ మహిళలకు అన్యాయం  చేస్తోందని మండిపడ్డారు.
 
  ఐద్వా జిల్లా అధ్యక్షులు వి.లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 32,817 గ్రూపులకు 3,47,810 మంది నష్టపోతున్నారన్నారు. మాఫీకి రూ.7400కోట్లు అవసరంకాగా 2,660 కోట్లు మాత్రమే కేటాయించారని, వడ్డికింద రూ.1310కోట్లు ఇస్తామని చెప్పారన్నారు. కానీ ఇంతవరకు విడుదల చేయలేదని దీనిని బట్టి చూస్తే రుణమాఫీ అందని  ద్రాక్షలా తయారైందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పందించి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు వి.ఇందిర, సంయుక్త కార్యదర్శి బి.లక్ష్మి,  సహాయ కార్యదర్శి పి.రమణమ్మ, జిల్లా నాయకులు ఆర్.గౌరమ్మ, కల్యాణి, రామలక్ష్మి తదితరులు  పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు