తమ్ముళ్ల మధ్య అడహాక్ చిచ్చు

19 Oct, 2014 03:16 IST|Sakshi
తమ్ముళ్ల మధ్య అడహాక్ చిచ్చు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు తమ్ముళ్ల మధ్య అడహాక్ కమిటీ చిచ్చు రాజుకుంటోంది. కమిటీలో కీలక బాధ్యతలు తమకే కావాలంటూ ముగ్గురు నేతలు పట్టుబడుతున్నారు. దీంతో నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్న టీడీపీ సభ్యత్వ నమోదుపై సందిగ్ధత నెలకొంది. టీడీపీలో జిల్లా, మండల, గ్రామ, నియోజక వర్గ కమిటీలకు గడువు పూర్తి కావచ్చింది. దీంతో అడహాక్ కమిటీలను నియమించి పార్టీ కార్యక్రమాలను కొనసాగించాలని రాష్ట్ర పార్టీ సూచించింది.

ముఖ్యంగా నవంబర్ మొదటి వారంలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న సభ్యత్వ నమోదు ను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఆ మేరకు జిల్లాలో రెండు పర్యాయాలు టీడీపీ ముఖ్యనాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నెల్లూరు నగర పార్టీ కన్వీనర్ పదవి కోసం ముగ్గురు నేతలు తనకే కట్టబెట్టాలని పోటీ పడినట్లు సమాచారం.

 అందులో ఒకరు నగర నియోజక వర్గ ఇన్‌చార్జి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రమేష్‌రెడ్డి, చాట్ల నరసింహారావు ఉన్నారు. వీరు కాకుండా రూరల్ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా నెల్లూరు సిటీ, రూరల్‌లో తన కనుసన్నల్లోనే సభ్యత్వ నమోదు ప్రక్రియ నడవాలని  భావిస్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

 తనకు కట్టబెడితేనే...
 అడహాక్ కమిటీలో నగర కన్వీనర్ బాధ్యతలను తనకు కట్టబెడితేనే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటానని, లేకపోతే బాలకృష్ణ వద్ద తేల్చుకుంటానని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించినట్లు సమాచారం.  తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అన్యాయం జరిగిందని, కనీసం అడహాక్ కమిటీలోనైనా న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని జిల్లా పార్టీ నాయకుల వద్ద గట్టిగా చెప్పినట్లు తెలిసింది.

అదే విధంగా ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి నగర నియోజక వర్గ ఇన్‌చార్జి బాధ్యతలను చూస్తున్నందున తనకే సభ్యత్వ నమోదు బాధ్యత అప్పగించాలని జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్రకు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. దీనిపై మాజీ మంత్రి రమేష్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నగర, రూరల్ నియోజక వర్గాల్లో సభ్యత్వ నమోదు తనకే అప్పజెప్పాలని గట్టిగా వాదించినట్లు సమాచారం.

టీడీపీ వ్యవస్థాపకుల్లో తాను కీలకమైన వ్యక్తి అయినందున తనకే బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే మంత్రి నారాయణ అనుచరుడైన చాట్ల నరసింహారావు నగర కన్వీనర్ పదవికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నగరంలో తమ వర్గం పట్టునిలుపుకునేందుకు మంత్రి ఆయనను తెరపైకి తీసుకొస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అడహాక్ కమిటీల ఏర్పాటు వ్యవహారం తలనొప్పిగా మారటంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదావేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు