ఆరోగ్య పరిరక్షణకే స్వచ్ఛ భారత్ | Sakshi
Sakshi News home page

ఆరోగ్య పరిరక్షణకే స్వచ్ఛ భారత్

Published Sun, Oct 19 2014 3:14 AM

ఆరోగ్య పరిరక్షణకే స్వచ్ఛ భారత్ - Sakshi

ఆత్మకూరు: ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణకే ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛభారత్‌ను ప్రవేశ పెట్టారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. చేజర్ల మండలం మడపల్లిలో సర్పంచ్ నారాయణ అధ్యక్షతన శనివారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకోవాలనే సంకల్పంతో కేంద్రం స్వచ్ఛభారత్‌కు శ్రీకారం చుట్టిందన్నారు.

పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులను శుభ్రపరచుకోవడం ద్వారా పలు వ్యాధులకు దూరంగా ఉండగలుగుతామన్నారు. శ్రమదానంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం కింద మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించేలా ఉచిత నిర్బంధ విద్యను కొనసాగించాలన్నారు.

 పాఠశాలల, వసతి గృహాల అభివృద్ధే లక్ష్యం:జెడ్పీ చైర్మన్
 జిల్లాలో అన్ని పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాలను అంచెలంచెలుగా అభివృద్ధి చేసేందుకు ఓ లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళుతున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. జన్మభూమి సభలో ఆయన మాట్లాడుతూ చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, చేజర్ల వసతిగృహానికి రూ.5 లక్షలు మంజూరు చేశామన్నారు. ఇదే తరహాలో ప్రాధాన్యాత అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, వసతిగృహాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

సుజల స్రవంతి పథకాన్ని అన్ని గ్రామాల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షురాలు ధనలక్ష్మి, ఉప మండలాధ్యక్షురాలు పూనూరు భారతి,  జెడ్పీటీసీ సభ్యురాలు షరీన్, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనీల్‌కుమార్ రెడ్డి, ఎంపీడీఓ వాణి, తహశీల్దార్ చంద్రశేఖర్, ఏఓ శ్రీదేవి, వైద్యాధికారి డాక్టర్ చందన్‌రెడ్డి, సీడీపీఓ సత్యవతి, సూపర్‌వైజర్లు విజయలక్ష్మి, శారదాదేవి, వైఎస్సార్‌సీపీ నేతలు కొమ్మి సిద్ధులు నాయుడు, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, పూనూరు గంగాధర్‌రెడ్డి, రామమనోహర్‌రెడ్డి, జయంతుల్ నాయుడు, సుబ్బారెడ్డి, గోవింద్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 మోదీతోనే దేశాభివృద్ధి
 ఉదయగిరి/వింజమూరు: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, ఆ మేరకు ఆయన అడుగులు వేస్తున్నారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఉదయగిరి, వింజమూరులో శనివారం జరిగిన జన్మభూమి-మాఊరు గ్రామసభల్లో ఆయన మాట్లాడుతూ అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి పథకాలు ఆశాజనక ఫలితాలివ్వగలవని భావిస్తున్నామన్నారు.

మోదీ ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంతో పాటు అగ్రదేశాల మన్ననలు పొందటం దేశానికి ఎంతో భవిష్యత్తులో మేలు జరుగుతుందన్నారు.  దేశంలో 2019 అక్టోబరు 2 నాటికి మరుగుదొడ్లు లేని కుటుంబాలు కనిపించకూడదన్న ఆశయంతో ముందుకు వెళుతున్నారన్నారు. ఈ కాల వ్యవధిలో రూ.1300 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.  ఎన్‌టిఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా అన్ని గ్రామాలకు పరిశుభ్రమైన నీరు అందించేలా కృషి జరుగుతోందన్నారు.

వైఎస్సార్ హయాంలో రూ.200 పింఛను అందరికీ అందే విధంగా చర్యలు తీసుకున్నారని, దానిని చంద్రబాబునాయుడు రూ.1000కు పెంచడం అభినందనీయమన్నారు.
 59 పాఠశాలల దత్తత : జిల్లాలోని 59 పాఠశాలలను దత్తతకు తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచేందుకు కృషి చేస్తున్నామని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. ఉదయగిరిలోని ఎస్సీ, ఎస్టీ, బిసీ వసతి గృహాల అభివృద్ధికి రూ.4.50 లక్షలు మంజూరుచేశామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చూడాలన్నారు.

ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామసభల్లో వింజమూరు, ఉదయగిరి సర్పంచ్‌లు గణపం బాలకృష్ణారెడ్డి, మొబీనా రియా జ్, జెడ్పీటీసీ సభ్యులు నారాయణరెడ్డి, ప్రవీణకుమారి, ఎంపీపీలు చేజర్ల సుబ్బారెడ్డి, గణపం కృష్ణకిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement