అయ్యో..చిట్టి తండ్రీ!

25 Jun, 2017 03:53 IST|Sakshi
అయ్యో..చిట్టి తండ్రీ!

తన చిట్టితండ్రి ఎడబాటును.. ఆ తండ్రి ఒక్క క్షణమైనా భరించలేడు. ఆ తల్లీ అంతే.. తన బంగారుబాబును వదిలి.. నిమిషమైనా ఉండలేదు. చిన్నారి బాబు బుడిబుడి అడుగులను చూసి వారెంతో మురిసిపోయేవారు. అమ్మ.. నాన్న అంటూ పలికే పొడిపొడి మాటలను విని ఉప్పొంగిపోయేవారు. ఏ పనిలో ఉన్నా వారికి బిడ్డ ధ్యాసే. నిన్న కాక అటు మొన్ననే.. ఆ చిన్నారికి ఏడాది నిండింది. తొలి జన్మదిన వేడుకను తల్లిదండ్రులు పెద్ద పండగలానే చేశారు. ఇంతలోనే వారి ఆశల దీపం ఆరిపోయింది. పరామర్శ కోసమని బిడ్డను తీసుకుని వచ్చిన ఆ తల్లి.. కళ్లెదుటే తన గారాలపట్టిని పోగొట్టుకుంది. ఎక్కడ నుంచి ఎలా వచ్చిందో మాయదారి మృత్యుశకటం.. ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసింది. పాపం.. తన బిడ్డ ఇంక లేడన్న విషయం ఆ తండ్రికి ఎలా చెప్పాలో..!!

రాజాం/సిటీ(శ్రీకాకుళం): తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన మరో తల్లికి కడుపుకోత మిగిలింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి మృత్యుఒడిలోకి చేరుకుంది. వన్‌వే ట్రాఫిక్‌ విధానం ఆ ఇంట్లో పుత్రశోకానికి కారణమైంది. వాటర్‌ప్యాకెట్‌ల లోడుతో వెళ్తున్న వ్యాన్‌ ఢీకొనడంతో ఓ చిన్నారి దుర్మరణం చెందాడు. శనివారం స్థానిక మేదరవీధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

విజయనగరం జిల్లాకు చెందిన పిల్లి కళావతి.. రాజాం మేదరవీధిలో ఉంటున్న తన తల్లి కోలా పార్వతిని పరామర్శించేందుకు రెండు రోజుల క్రితం వచ్చింది. కళావతి భర్త గురునాథరావు వలస కూలీగా జీవనం సాగిస్తున్నాడు. కళావతి కూడా భర్తతోనే హైదరాబాద్‌లో ఉంటోంది. వీరికి 13 నెలల ఢిల్లీశ్వరరావుతోపాటు ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. భర్త హైదరాబాద్‌లో ఉంటుండగానే.. కళావతి విజయనగరం వచ్చింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి కళావతిని పరామర్శించేందుకు ఈ నెల 22న పిల్లలతో కలసి రాజాం వచ్చింది. అప్పటి నుంచి మేదరవీధిలో తల్లిదండ్రులు పార్వతి, బంగారయ్యల వద్దనే ఉంది. మరో రెండు రోజుల్లో తిరుగు ప్రయాణమవ్వాల్సి ఉంది.

 శనివారం ఉదయం ఇంటి ఆవరణలో తన 13 నెలల కుమారుడు ఢిల్లీశ్వరరావుతో కలసి ఉంది. అదే సమయంలో వన్‌వే ట్రాఫిక్‌ కారణంగా అటుగా వచ్చిన వాటర్‌ప్యాకెట్‌ల లగేజీ వ్యాన్‌ ఆ ఇంటిపైకి దూసుకువచ్చింది. దీంతో ఇంటి వరండాలో ఉన్న బాలుడు ఢిల్లీశ్వరరావు ప్రమాదానికి గురయ్యాడు. వ్యాన్‌ ముందర భాగం బాలుడి తలను గట్టిగా ఢీకొంది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.  కళ్లముందు ఆడుతున్న ఢిల్లీశ్వరరావు విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. ఇంట్లో ఉన్న కళావతి తల్లిదండ్రులు బంగారయ్య, పార్వతిలు కూడా బయటకు వచ్చి ఘొల్లుమన్నారు.

పాపం.. కన్నబిడ్డ చావు చూడటానికే వచ్చిందా!!
కళావతికి ఏడేళ్ల క్రితం విజయనగరానికి చెందిన గురునాథరావుతో వివాహం జరిగింది. భార్యాభర్తలు అక్కడే ఉంటున్నారు. పొట్టకూటి కోసం హైదరాబాద్‌ వెళ్లడం.. కొద్దిరోజులు పని చేసి విజయనగరం రావడం వారికి పరిపాటి. వీరికి ఇద్దరు మగపిల్లలు. హాయిగా జీవనం సాగిపోతుందనుకున్న సమయంలో చిన్న కుమారుడు ఢిల్లీశ్వరరావు మృతి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.  ఆ తల్లి సొమ్మసిల్లిపోయింది. ఈ విషయాన్ని చిన్నారి తండ్రికి చేరవేసేందుకు బంధువులు సాహించలేకపోయారు. రాజాం సీఐ శంకరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారి మృతదేహాన్ని బంధువులు విజయనగరం తీసుకుపోయారు.

మరిన్ని వార్తలు