బరువు మోస్తేనే..భోజనం!

15 Jul, 2018 11:53 IST|Sakshi

ఈ ఫొటోలో భోజనం గంప నెత్తిన పెట్టుకుని క్యారీ చేతపట్టుకుని రోడ్డుపై నడుస్తున్న చిన్నారులు పొలం వద్దకు వెళుతున్నారనుకుంటే పొరబడినట్లే. పాఠశాలలో చదువుకుంటున్న తోటి చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఇలా బరువు మోస్తున్నారు. ప్రతిరోజు ఆ పాఠశాలలో చదివే చిన్నారులు పడుతున్న ఇబ్బందులు శనివారం సాక్షి కంటపడింది. మండలంలోని చిన్నగోపవరం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు వంట ఏజెన్సీ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. పాఠశాల వద్ద వంటగది లేకపోవడంతో ఆమె తన ఇంటి వద్దే భోజనాన్ని తయారు చేస్తుంది. అయితే పాఠశాల ఊరి చివర ఉండటం, సుమారు కిలోమీటరు ఉండటంతో ఆ వృద్ధురాలు భోజనాన్ని పాఠశాల వద్దకు తీసుకెళ్లడం కష్టమైంది. దీంతో ఉపాధ్యాయులు ప్రతిరోజు భోజనాన్ని తీసుకువచ్చే బాధ్యత విద్యార్థులకు అప్పచెప్పారు. చేసేదేమీ లేక చిన్నారులు ఇలా భోజనం గంప నెత్తిన పెట్టుకుని నడిచి వెళుతున్న ఆ దృశ్యాన్ని చూసిన వారంతా అయ్యో పాపం ఎంత కష్టపడుతున్నారో అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారుల చేత బరువు మోయిస్తున్న విషయంపై హెచ్‌ఎం ఓబులేసును వివరణ కోరగా అందులో తప్పేముందని సమర్థించడం గమనార్హం.     

–గోపవరం

మరిన్ని వార్తలు