అమ్మా...నువ్వొద్దు

31 Jul, 2014 09:53 IST|Sakshi
అమ్మా...నువ్వొద్దు

ఇద్దరు బిడ్డల ఆవేదన
ప్రొద్దుటూరు క్రైం:
ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరని పదం అమ్మ.. అనుక్షణం బిడ్డల కోసం పరితరిస్తుంది అమ్మ మనసు.. అలాంటి ఒక అమ్మను బిడ్డలు వద్దంటున్నారు.. బరువెక్కిన హృదయంతో.. ఇద్దరు పిల్లలు మీడియా ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు. వారి మాటల్లోనే... అన్నాచెల్లెళ్లమైన మా పేర్లు సాయికృష్ణ, గౌరీప్రియ. మా నాన్న పల్లా బాబు, అమ్మ ఉమాదేవి. పట్టణంలోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నాం. నాన్న బస్సు డ్రైవర్. డ్యూటీ మీద బయటికి వెళ్తే రెండు మూడు రోజులకు గాని ఇంటికి రాడు. నాన్న సంపాదన చిన్నపాటిదైనా మేమందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. అయితే  నాలుగేళ్ల నుంచి గొడవలు మొదలయ్యాయి. మా కుటుంబంలో ఓ వ్యక్తి విలన్‌లా ప్రవేశించాడు.  నాన్న లేని సమయాల్లో ఇంటికి వచ్చేవాడు.

అతను రాగానే మమ్మల్ని అమ్మ బయటికి పంపించేది. ఓ రోజు వాళ్లిద్దరూ ఇంట్లో ఉండగా నాన్న కళ్లారా చూశాడు. మా వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను వస్తున్నాడు.. నువ్వు బయటికి పో అని  నాన్నను కూడా బయటికి పంపించేది. నాన్న బయటికి వెళ్లనని చెబితే కేసు పెడతానని బెదిరించేది. అన్నంతపని చేసి నాన్నపై తప్పుడు కేసు పెట్టింది. వారం రోజుల పాటు జైళ్లో ఉన్న నాన్న బయటికి వచ్చిన తర్వాత ఇక ఉండలేనంటూ అమ్మను వదలి వచ్చాడు. అమ్మ మనసు మార్చాలని చాలా సార్లు ప్రయత్నించాడు.

కానీ ఫలితం లేదు. ఆ తర్వాత ఆ వ్యక్తితో కలిసి అమృతానగర్‌లోని ఓ ఇంటిలోకి మమ్మల్ని తీసుకెళ్లింది.  చీటికీ మాటికీ అతనితో పాటు అమ్మ కూడా మమ్మల్ని కొట్టేది. డిష్ వైరుతో చంపాలని చూశారు. విడాకులు ఇవ్వమని చాలా సార్లు నాన్న అడిగినా అమ్మ ఇవ్వలేదు. ఓ రోజు నాన్న బజారులో కనబడితే మాట్లాడాం. అది చూసిన అతను మమ్మల్ని వాతలు పడేలా కొట్టాడు. ఈ బాధలు భరించలేక నాలుగు రోజుల కిందట స్కూల్‌కని వెళ్లి మా నాన్న వద్దకు వచ్చేశాం. ఇక మేము అమ్మ వద్దకు వెళ్లం.. నాన్న వద్దనే ఉంటాం.. నాన్న నీడలోనే పరువుగా జీవిస్తాం.. అమ్మతో పాటు అతనితో  మాకు ప్రాణ హాని ఉంది. మాకు రక్షణ కల్పించాలి.

మరిన్ని వార్తలు