‘డ్రాగన్’ చేతికి భవానీ ద్వీపం

4 Jul, 2015 04:02 IST|Sakshi
‘డ్రాగన్’ చేతికి భవానీ ద్వీపం

* పారిశ్రామిక టౌన్‌షిప్ ఏర్పాటు చేయించేందుకు సర్కారు యత్నం
* చైనా బృందానికి ప్రత్యేక హెలీకాప్టర్ సమకూర్చిన వైనం

సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: కృష్ణమ్మ గర్భంలో కొలువుదీరి ఆంధ్రప్రదేశ్ పర్యాటక చిత్రపటంలో ప్రముఖంగా చోటు దక్కించుకున్న భవానీ ద్వీపాన్ని చైనాలోని అతిపెద్ద ప్రైవేటు కమర్షియల్ స్పేస్ డెవలపర్ డాలియన్ వాండా కంపెనీ చేతికి అప్పగించేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమవుతోంది. భవానీ ద్వీపాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించాలనే యోచనలో ఉన్న ప్రభుత్వానికి వాండా గ్రూప్ ప్రతినిధుల పర్యటన కలిసొచ్చింది.

133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ద్వీపంలో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించేందుకు వాండా గ్రూపు ప్రతినిధులు ఆసక్తి కనబరిచినట్లు అధికార వర్గాల సమాచారం. జూలై 15 నాటికి సింగపూర్ నుంచి సీడ్ కేపిటల్ ప్లాన్ అందిన తర్వాత భవానీ ద్వీపాన్ని లీజుకిచ్చేందుకు సర్కారు పెద్దలు ఉద్యుక్తులవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
సీఎం ఆహ్వానంతో.... :ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో వాండా కంపెనీ ప్రతినిధుల్ని ఆహ్వానించారు. డాలియన్ వాండా గ్రూప్‌తో పారిశ్రామిక టౌన్‌షిప్ ఏర్పాటు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడుతోంది. వాండా గ్రూప్ పారిశ్రామిక టౌన్‌షిప్‌కు అనువైన స్థలం కోసం కొద్దిరోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. అందులో భాగంగా గురువారం మన రాష్ట్రానికీ వచ్చింది. దీంతో మాథ్యూ అబాట్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పరిశీలించింది.

గురువారం రాజధాని ప్రాంతంలోని అనంతవరం, నిడమర్రుతోపాటు కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి ప్రాంతాల్లో పర్యటించింది. శుక్రవారం ప్రకాశం జిల్లా దొనకొండ, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టుకు సమీపంలోని కత్తువపల్లి ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను పరిశీలించింది. భవానీ ద్వీపం ఏరియల్ వ్యూ కోసం ఏపీఐఐసీ, ఇన్‌క్యాప్ ఉన్నతాధికారులు హెలీకాప్టర్‌ను రప్పించారు. అందులోనే చైనా బృందం విజయవాడ నుంచి దొనబండ అటు నుంచి కృష్ణపట్నం పోర్టు అక్కడి నుంచి తిరుపతి వెళ్లింది. వాండాపైఆసక్తి తెలియజెప్పేందుకే చైనా బృందానికి ప్రభుత్వం రెడ్‌కార్పెట్ వేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు