దేవుడి భూములను ముట్టుకునే హక్కు సీఎంకు కూడా లేదు

13 Mar, 2019 07:55 IST|Sakshi

ధర్మకర్తలు, ఈవోలు దేవుడి ఆస్తులు, భూములను కాపాడాలి

బ్రాహ్మణుడికి, దేవుడికి ఇచ్చిన భూములను ముట్టుకునే హక్కులేదు

మహాభారతంలో చెడ్డవాడైన దుర్యోధనుడే ఆమాట చెప్పాడు

మనం దుర్యోధనుడికంటే దారుణంగా బతికితే ఎలా? త్రిదండి చినజీయర్‌స్వామి

సింహాచలం: దేవుడి భూముల్లో ఒక్క అంగుళం కూడా ముట్టుకునే హక్కు ముఖ్యమంత్రికి కూడా లేదని పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితులు త్రిదండి చిన జీయర్‌స్వామి అన్నారు. సింహాచలం దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురం గోశాలలో ఈ నెల 11 నుంచి జరుగుతున్న సుదర్శన నారసింహ మహాయజ్ఞంలో మంగళవారం పాల్గొన్న ఆయన వేదికపై అనుగ్రహ భాషణం చేశారు. దేవుడి భూముల్లో ఒక్క అంగుళం కూడా ముట్టుకునే హక్కు దేవాలయాల ఈవోలకే కాదు.. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కూడా లేదని స్పష్టం చేశారు. బ్రాహ్మణులకు, దేవుడికి ఇచ్చిన భూములు తప్ప మిగతా వాటిని మనం ఎలాగైనా శాసించవచ్చని మహాభారతంలో చెడ్డవాడిగా చెప్పుకునే దుర్యోధనుడే చెప్పాడని తెలిపారు. దుర్యోధనుడికంటే దారుణంగా మనం బతికితే ఎలాగని ప్రశ్నించారు. దీన్నిబట్టి చూస్తే ఆ కాలంలో దుర్యోధనుడే చాలా గొప్పవాడన్నారు.

దేవుడి ఆస్తితో ఆటలొద్దు
దేవుడి ఆస్తితో, భూములతో ఆటలాడుకోవడం మంచిపద్ధతి కాదన్నారు. దేవస్థానాన్ని, దేవాలయాన్ని అప్పగించారని ధర్మకర్తలు, ఈవోలు స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని వాడుకోకూడదన్నారు. అలాగే దేవాలయాల్లో స్వామికి భక్తులు ఇచ్చే ఆభరణాలు వైదికులకు ఇస్తే వాటిని వారు వాడుకోకూడదన్నారు. అలా జరిగితే పాలకుల అసమర్థత అవుతుందన్నారు. సింహాచలం దేవస్థానం భూసమస్య పరిష్కారం అంటూ ఇటీవల ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్‌ విషయాన్ని విన్నానన్నారు. దేవస్థానానికి పూర్వీకులు ఇచ్చిన ఆస్థిని కాపాడాలన్నారు. దేవుడి కోసం మనం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. దేవుడి ద్వారా సమాజం బాగుపడుతుందని, సామాజిక వ్యక్తుల్లో నైతిక బలం పెరుగుతుందనే ఉద్దేశంతో ఆరోజు వేలాది ఎకరాలు మన పూర్వీకులు దేవుడికి ఇచ్చారని తెలిపారు. నిజంగా జనాలపై ప్రేమ పొంగిపొర్లుతుంటే దేవుడి భూమి ఒక్క ఇంచు కూడా ముట్టుకో కుండా ప్రభుత్వ భూమి అంతా దానం చేయాలని సూచించారు. ఆలయ వ్యవస్థలను, భూము లను కాపాడాల్సిన భాధ్యత ధర్మకర్తలు, ఈవోలపై ఉంటుంద న్నారు. కార్యక్రమంలో పాల్గొన్న దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతి రాజు, ఈవో కె.రామచంద్ర మోహన్‌లను చూపిస్తూ ఆవిధంగా చేయాలని సూచించారు.

ఆలయ వ్యవస్థని కాపాడుకోవాలి
ఆలయ వ్యవస్థని జాగ్రత్తగా పెట్టుకుంటే సమాజంలో ఉన్న ప్రతీ వ్యక్తికి శ్రేయస్సు కలుగుతుందన్నారు. భగవంతుడు మేఘం వంటివాడని, మేఘానికి పక్షపాతం ఉండదన్నారు. సింహాచలం దేవస్థానం ప్రస్తుత కాలంలో చాలా గొప్ప ఆలయమన్నారు. ప్రతీ ఆలయంలో ఒక నిత్యాగ్నిహోత్రం ఉండేదని, ఆలయం ప్రారంభం నుంచి అగ్నిహోత్రం సాగుతుంటుందన్నారు. ఇప్పుడు చాలాచోట్ల ఆ వ్యవస్థ లేదని నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఒక్క సింహాచలం దేవస్థానంలో ఆ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగడం ఎంతో గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అహోబిల రామానుజ జీయర్‌ స్వామి మాట్లాడుతూ దేవస్థానంలో సుదర్శన నారసింహ మహా యజ్ఞం నిర్వహణ చాలా గొప్ప కార్యక్రమమని తెలిపారు.

మరిన్ని వార్తలు