‘మామూలు’ కోసం ‘వల’లో చిక్కారు

25 Sep, 2014 00:49 IST|Sakshi
‘మామూలు’ కోసం ‘వల’లో చిక్కారు

కాకినాడ క్రైం :మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై సర్కారుకు ఎంత మక్కువో.. అంతే మక్కువ మామూళ్ల ద్వారా వచ్చే రాబడిపై ఆ శాఖలో అనేకమంది అధికారులకు ఉంటుంది. పేరుకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అయినా..నిబంధనలను పాతరేసైనా మద్య విక్రయాల జాతర రాత్రింబవళ్లు జరగాలని, వాడకొకటిగా బెల్టుషాపులు వర్ధిల్లాలని అలాంటి వారు కోరుకుంటారు. అప్పుడే తమకు వచ్చే పైడబ్బులు ఇబ్బడిముబ్బడి అవుతాయనుకుంటారు. అందుకోసం మద్యం షాపుల వారిని వేధిస్తారన్నది బహిరంగ రహస్యమే. అలా లంచం గుంజాలనుకున్న కాకినాడ నార్త్ స్టేషన్ సీఐ వి.శివరామరాజు బుధవారం అవినీతి నిరోధకశాఖ వలలో చిక్కుకున్నారు. కాగా సీఐ శివరామరాజు తమను మామూళ్ల కోసం విపరీతంగా సతాయించే వారని ఆయన పరిధిలోని మద్యం వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
 
 రెండు రోజుల క్రితం కాకినాడ పద్మప్రియ థియేటర్ రోడ్లోని శ్రీ సూర్య లిక్కర్ వరల్డ్‌కు వెళ్లి లెసైన్స్ ఫీజు నిమిత్తం రూ.60 వేలు, తనకు నెలవారీ మామూలుగా రూ.40 వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. షాపు యజమాని చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వరరావు రూ.లక్ష ఇవ్వలేనని, రూ.80 వేలు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నారు. అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సుబ్రహ్మణ్యేశ్వరరావు వారి సూచన మేరకు బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో వారిచ్చిన రూ.80 వేలు తీసుకుని పైడా వారి వీధిలోని ఎక్సైజ్ నార్త్ స్టేషన్‌కు వెళ్లారు.
 
 ఆయన నుంచి ఆ మొత్తాన్ని తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ కరెడ్ల శ్రీరామచంద్రరావు దాన్ని ఎస్సై డి.దామోదర్‌కు అప్పగించా రు. ఎస్సై సీఐ కార్యాలయంలోకి వెళ్లి ఙఆ మొత్తాన్ని సీఐ శివరామరాజుకు అందిస్తుండగా మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీఐ శివరామరాజుతో పాటు హెచ్‌సీ, ఎస్సైలను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టు చేసి, విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యాలయంలోని ఫైళ్లతో పాటు శివరామరాజుకు చెందిన ఇతర వ్యవహారాలపై కూడా దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. ఏసీబీ సీఐ రాజశేఖర్, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.
 
 ఎక్సైజ్ శాఖలో గుబులు
 కాగా నార్త్ స్టేషన్ సీఐ శివరామరాజు ఏసీబీకి పట్టుబడడంతో ఎక్సైజ్ శాఖలో గుబులు రేగింది. ఈ శాఖపై అనేక అవినీతి ఆరోపణలున్నా బాధితులు ఇంతవరకూ ఏసీబీ అధికారుల ఆశ్రయించలేదు. ఇప్పుడు సీఐ స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడ డం అటు ఎక్సైజ్ శాఖలో, ఇటు మద్యం వ్యాపారుల్లో చర్చనీయాంశమైంది. ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది మద్యం షాపుల నిర్వాహకుల నుంచి నెల నెలా పెద్ద మొత్తంలో సొమ్ములు దండుకుంటూ.. మద్యం అధికధరలకు అమ్మినా, యథేచ్ఛగా బెల్టుషాపులు నడిపినా పట్టించుకోరని, నాటుసారా తయారీ, అమ్మకందారుల నుంచి కూడా  నెలవారీ మామూళ్లు గుంజుతారనే విమర్శలు ఎప్పుడూ ఉన్నవే. జిల్లాలో బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా నెలకు మండలానికి ఒక బెల్టుషాపుపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకొనేలా ఎక్సైజ్ అధికారులకు, మద్యం సిండికేటుకు లోపాయకారీ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఏసీబీ నిశితంగా దృష్టి సారిస్తే ఎక్సైజ్ శాఖలో దొరికే అవినీతిపరులకు కొదవ లేదని పలువురు అంటున్నారు.
 

>
మరిన్ని వార్తలు