హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై సీఐడీ

16 Jun, 2016 08:57 IST|Sakshi

దేవుని కడప పోలీసు హౌసింగ్ సొసైటీలో గోల్‌మాల్
రాజకీయాలకతీతంగా విచారణ జరిగేలా ప్రణాళిక
ఇటీవలే పోలీస్‌స్టేషన్‌లో  కేసు నమోదు
కర్నూలు సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం

 సాక్షి కడప : పోలీసు హౌసింగ్ సొసైటీ గోల్‌మాల్ వ్యవహారాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. రాజకీయాలకతీతంగా.. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు భావిస్తున్న నేపథ్యంలో సీఐడీ(క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంటు)కి అప్పగించారు. అందుకు సంబంధించి కేసును సీఐడీకి అప్పగిస్తూ మంగళవారమే నిర్ణయం తీసుకున్నప్పటికి బుధవారం ఫైల్స్‌ను అందజేసినట్లు తెలుస్తోంది. కడప నగరంలోని దేవుని కడప పోలీస్ హౌసింగ్ సొసైటీ వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు పిర్యాదులు వెలువెత్తాయి. దీంతో ప్రస్తుత ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ సీఐడీకి కేసును అప్పగించారు.

 కోట్లాది రూపాయల అక్రమాలు జరగడంతోనే..
జిల్లాలోని పోలీసులకు సంబంధించి 2004లో హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేవుని కడప ప్రాంతంలోని కొంత భూమిని పోలీసు సొసైటీకి కేటాయించారు. ఇందులో కానిస్టేబుల్ నుంచి ఎస్పీస్థాయి అధికారుల వరకు దాదాపు 440మందికి ఇళ్ల పట్టాలు నామమాత్రపు ధరతో అందజేశారు. ఈ వ్యవహారంలో కొంతమందికి ప్రత్యేక లబ్ధి జరిగిందని..రూ.కోట్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇటీవలే ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున పోలీసు వర్గాల్లో ప్రచారం జరగడంతోపాటు చర్చకు దారితీసిన నేపథ్యంలో ఇటీవలే ఒకరు కడపలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హౌసింగ్ సొసైటీ అక్రమాలపై పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కోట్లకు సంబంధించిన అక్రమాల వ్యవహారం కావడంతో ఈ కేసును సీఐడీకి అప్పగించాలని నిర్ణయించడంతోపాటు వన్‌టౌన్ సీఐ రమేష్‌తో కూడా జిల్లా ఎస్పీ రామకృష్ణ వివరాలపై ఆరా తీశారు. హౌసింగ్ సొసైటీలో అక్రమాల వ్యవహారంలో ఏమి జరుగుతుందోనని ఒకపక్క పోలీసు వర్గాల్లో ఆసక్తి నెలకొనగా.. మరోపక్క అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో గుబులు రేపుతోంది.

 నేడో.. రేపో రంగంలో దిగనున్న సీఐడీ
దేవుని కడప పోలీస్ హౌసింగ్ సొసైటీ వ్యవహారాన్ని కర్నూలు సీఐడీ పోలీసులకు అప్పగించడంతో త్వరలోనే బృందం కడపకు రానున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి రికార్డులను స్వాధీనం చేసుకోవడంతోపాటు పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు పెద్దఎత్తున రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నుంచి త్వరలోనే బృందం కడపకు వచ్చి విచారణ చేపట్టనుంది. హౌసింగ్ సొసైటీ వ్యవహారంపై సంబంధిత పోలీసు అధికారులతోపాటు బాధితులు, ఇతర అన్నివర్గాలతో కూపీ లాగనున్నట్లు సమాచారం.   ఈ విషయమై హౌసింగ్ సొసైటీ అక్రమాల వ్యవహారాల కేసును సీఐడీకి అప్పగించినట్లు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు