చింతమనేనిని అరెస్ట్ చేయాలి

10 Jul, 2015 02:43 IST|Sakshi
చింతమనేనిని అరెస్ట్ చేయాలి

- రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్
- విధులను బహిష్కరిస్తామని హెచ్చరిక
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) :
కృష్ణాజిల్లా ముసునూరు తహసిల్దార్‌పై దాడి చేయించిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని రెవెన్యూ అసోషియేషన్ రాష్ర్ట కార్యదర్శి ఎల్‌వీ సాగర్ డిమాండ్ చేశారు. చింతమనేనిని అరెస్ట్ చేయాలంటూ రెవెన్యూ ఉద్యోగులు గురువారం సాయంత్రం కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ నేర చరిత్ర ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ విప్‌గా ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు.

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రభాకర్‌ను అరెస్టు చేయించిన విషయం మరిచారా అని చంద్రబాబును ప్రశ్నించారు. అనేక కేసులలో ముద్దాయిగా ఉన్న విప్ ప్రస్తుతం తనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే డీఐజీని దర్జాగా కలిసి వెళ్లడం చూస్తే ఆయన అధికార దర్పం అర్థమవుతుందని విమర్శించారు.  పాలకులే దగ్గరుండి దాడులు చేయిస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో ఆంధ్రా ఉద్యోగులకు కేంద్ర బలగాలతో రక్షణ ఇవ్వాలని గవర్నర్‌ను ఇటీవలే కోరామన్నారు. రాష్ట్రంలో మాత్రం పాలకులే దాడులకు పాల్పడుతున్నారన్నారు. చింతమనేనిని శుక్రవారం 10 గంటలలోగా అరెస్ట్ చేయకపోతే రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళన చేపడతామన్నారు. మిగిలిన శాఖల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరవుతారని, వర్క్‌టు రూల్ పాటిస్తామని సాగర్ స్పష్టం చేశారు. దర్నాకు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.రమేష్‌కుమార్, కలెక్టరేట్ విభాగ అధ్యక్షుడు ఎన్‌వీ నాంచారయ్య, జిల్లా సహాయ కార్యదర్శి డీవీఎన్ సత్యనారాయణ నాయకత్వం వహించారు. కలెక్టరేట్‌లోని రెవిన్యూ విభాగ ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు