సీఎం దత్తత.. ఇదేనా దక్షత?

17 May, 2018 12:54 IST|Sakshi
వైద్యపరీక్షల కోసం బారులు తీరిన రోగులు

అరకులోయ ఏరియా ఆస్పత్రిలో వైద్యం పూజ్యం

అరకులోయ: పెదలబుడు పంచాయతీని సీఎం చంద్రబాబు దత్తత చేసుకోవడంతో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఆనందించారు. ముఖ్యంగా ఉన్నత వైద్యసేవలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంతోషించారు. కానీ అరకులోయ  ప్రాంతీయ ఆస్పత్రి దుస్థితి అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది. పేరుకు 100 పడకల ఆస్పత్రి అయినప్పటికీ రోగులకు మంచాలు తప్ప సకాలంలో ఉన్నత వైద్యం మాత్రం కరువైంది. అనంతగిరి, డుంబ్రిగుడ, డుంబ్రిగుడ మండలాలతోపాటు, హుకుంపేట మండలంలోని ఐదు పంచాయతీల గిరిజనులందరికీ అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ప్రధాన ఆధారం. కానీ ఇక్కడ సాధారణ వైద్యులే ఉండడంతో ఉన్నత వైద్యసేవలకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ కేజీహెచ్‌కు వెళ్లాల్సివస్తోంది.

మత్తు వైద్యుడు తప్ప స్పెషలిస్టులు కరువు
ఈ ఆస్పత్రిలో ఆపరేషన్‌లు చేసే ఉన్నత వైద్యనిపుణులు లేనప్పటికీ మత్తు వైద్యనిపుణుడు డాక్టర్‌ దయాకర్‌ మాత్రం పనిచేస్తున్నారు. మత్తు ఇచ్చే వైద్యుడు ఉన్నా ఆపరేషన్‌ చేసే నాధుడు లేక ఆపరేషన్‌ ధియేటర్‌ ఎప్పుడూ మూసివుంటుంది. సివిల్‌ సర్జన్, చిన్నపిల్లలు, స్త్రీ వైద్యనిపుణుల వైద్య పోస్టులను ప్రభుత్వం ఇంతవరకు భర్తీ చేయలేదు. మత్తు వైద్యనిపుణుడు కాక ముగ్గురు కాంట్రాక్ట్‌ వైద్యులు పనిచేస్తున్నారు.

గర్భిణులు, చిన్నారులకు నరకమే
ముఖ్యమైన గైనిక్, చిన్నపిల్లల వైద్యనిపుణుల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఉన్నత వైద్యం కరువైంది. గతంలో 15 రోజులకు ఒకరు చొప్పున గైనికాలజిస్టులను డిప్యూటేషన్‌పై మైదాన ప్రాంతాల నుంచి ఈ ఆస్పత్రికి రప్పించేవారు. అయితే మే నెల ఒకటో తేదీ నుంచి వారు కూడా ఆస్పత్రికి రావడం మానేశారు. దీంతో గర్భిణులకు వైద్యపరీక్షలు, డెలివరీలను సాధారణ వైద్యులే చూస్తున్నారు. డెలివరీ కష్టంగా మారితే కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. విశాఖ వెళ్లేంతవరకు దారి మధ్యలో గర్భిణులు నరకం చూస్తున్నారు.

అంబులెన్స్‌ సేవలూ కరువే
ఆస్పత్రిలో రోగులను కేజీహెచ్‌కు తరలించేందుకు అవసరమైన అంబులెన్స్‌ సేవలు కూడా గత రెండేళ్ల నుంచి అందుబాటులో లేవు. అంబులెన్స్‌ మరమ్మతులతో మూలకు చేరడంతో విజయనగరం జిల్లా కొత్తవలస గ్యారేజీకి తరలించారు. దీంతో ఆస్పత్రి నుంచి కేజీహెచ్‌కు అత్యవసర రోగులను తరలించేందుకు 108 వాహనం పైనే ఆధారపడుతున్నారు. సకాలంలో 108 రాకపోతే రోగులకు మరణమే శరణ్యంగా మారింది.

భయమేస్తోంది..
ఆస్పత్రిలో తనిఖీలు జరుపుకుని, డెలివరీలు ఇక్కడే జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ అరకులోయ ఆస్పత్రిలో గైనిక్‌ డాక్టర్‌ లేకపోవడంతో సాధారణ వైద్యులే పరీక్షలు జరుపుతున్నారు. నా కడుపులో బిడ్డ ఎదుగుదల, ఆరోగ్య సమాచారం పూర్తిగా చెప్పలేకపోతున్నారు. మొదటి కాన్పు కావడంతో ఇక్కడ ప్రసవించేందుకు నాకు భయమేస్తోంది.
–సమర్ధి శీరిష, గర్భిణి,కొత్తభల్లుగుడ, అరకులోయ మండలం

మరిన్ని వార్తలు