కేంద్రంపై ఎలా ఒత్తిడి తేవాలో నిర్ణయిస్తా

3 Feb, 2018 01:41 IST|Sakshi

మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు

సాక్షి, అమరావతి: బడ్జెట్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కేంద్రంపై ఒత్తిడి తెద్దామని, అదెలా అనేది రెండురోజుల్లో నిర్ణయిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో కేంద్ర బడ్జెట్‌ తీరుతెన్నులపై ఆయన మాట్లాడారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొత్త రాజధాని అమరావతిని కేంద్రం నగరంగా చూడడంలేదని... ముంబై, బెంగుళూరు మెట్రో రైలు ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు ఇచ్చి అమరావతి మెట్రోను పరిగణనలోకి తీసుకోలేదని సీఎం వ్యాఖ్యానించారు.

ఇది అటు పూర్తిగా పల్లెటూరుగానూ, పూర్తిగా నగరంగానూ లేకపోవడంవల్ల దీన్ని పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు. కనీసం విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకైనా నిధులిస్తే బాగుండేదన్నారు. బడ్జెట్‌లో ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులిచ్చారని, దక్షిణాది రాష్ట్రాలపై నిర్లక్ష్యం చూపారని చెప్పారు. నీతి ఆయోగ్‌ నిధులను రాష్ట్రానికి ఎలా తేవచ్చో అధ్యయనం చేయాలని, ఈఏపీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో అధ్యయనం చేస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, విద్యుత్‌ శాఖ మంత్రి కళా వెంకట్రావు చెప్పారు.

మరిన్ని వార్తలు