అలా వచ్చి ఇలా వెళ్లారు

26 Mar, 2019 11:36 IST|Sakshi

పేలవంగా సాగిన సీఎం సభలు

జనసమీకరణ కోసం అభ్యర్థుల తంటాలు

సీఎం రాక ఆలస్యం కావడంతో వెనుదిరిగిన జనం  

సాక్షి, నెల్లూరు/వెంకటగిరి/సూళ్లూరుపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలు పేలవంగా జరిగాయి. వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరుల్లో ఎన్నికల రోడ్‌షోను సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఆయా సభలకు జన సమీకరణ కోసం టీడీపీ అభ్యర్థులు నానాతంటాలు పడ్డారు. పురుషులకు రూ.400, మహిళలకు రూ.200 వంతున నగదు ఇచ్చి జనసమీకరణ చేశారు. షెడ్యూల్‌ ఆలస్యం కావడంతో విసిగిపోయిన జనం సీఎం రాకముందే తిరుగుముఖం పట్టారు. వెంకటగిరిలో ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభం కావాల్సి ఉండాల్సి ఉండగా మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలైంది.

అలాగే సూళ్లూరుపేట, గూడూరుల్లో షెడ్యూల్‌ ప్రకారం ప్రచారం ప్రారంభం కాకపోవడంతో హాజరైన వారు అభ్యర్థులపై తిట్లదండకం అందుకున్నారు. 20 నిమిషాలు సభలో ఉంటే కూలీ డబ్బులిస్తామని తీసుకొచ్చి గంటల సేపు నిరీక్షణ చేయించారంటూ అనేకమంది మండిపడ్డారు. మండుటెండలో ఆకలితో నకనకలాడుతుండడంతో డబ్బులు కూడా వద్దంటూ వెళ్లిపోవడం కనిపించింది. చంద్రబాబు ప్రసంగం కూడా ఆకట్టుకోలేదు. నరేంద్రమోదీ, కేసీఆర్, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేసిన ప్రసంగంపై సభికులు పెదవి విరిచారు. అన్నదాన సుఖీభవ కింద నగదు ఇచ్చానని చెప్పడంపై రైతు రుణమాఫీకి సంబంధించిన రెండు విడతలు ఇంకా పెండింగ్‌లో పెట్టావు కదా పలువురు అనడం కనిపించింది. పసుపు – కుంకుమ కింద మహిళలకు నగదు ఇచ్చానని చెప్పడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు.  


ఆకట్టుకోని సీఎం ప్రసంగం 
వెంకటగిరిలో సీఎం ప్రసంగం 20 నిమిషాలపాటు సాగింది. ఆయన ఎక్కువగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనే విమర్శలు గుప్పించారు. సీఎం ప్రసంగంలో పసలేదని తెలుగు తమ్ముళ్లే పెదవి విరిచారు. ఇక వివేకానందరెడ్డి హత్య, ఓట్ల తొలగింపు వ్యవహరాల్లో ప్రతిపక్షనేత  వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పాత్రపై ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడంతో టీడీపీ అభిమానుల సైతం సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. మొదట హెలిప్యాడ్‌ నుంచి రోడ్‌షోగా చంద్రబాబు సభాస్థలమైన త్రిభువని సెంటర్‌కు చేరుకుంటారని టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. అయితే పర్యటన ఆలస్యం కావడంతో చాలాసేపు ఎదురుచూసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సొంత మండలాలకు వెళ్లిపోయారు. దీంతో నాయకులు రోడ్‌షోను రద్దు చేశారు. చంద్రబాబు నేరుగా హెలిప్యాడ్‌ నుంచి సభాస్థలికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనంలో పోలీస్‌ కాన్వాయ్‌ మధ్య చేరుకున్నారు.  


సూళ్లూరుపేటలో..
సూళ్లూరుపేట: పట్టణంలోని  చెంగాళమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పులికాట్‌ సరస్సు అభివృద్ధికి రూ.48 కోట్లు మంజూరు చేస్తున్నాని మరోమారు ప్రకటించడం విశేషం. తనపై కుట్ర చేస్తున్నారని, ఆ కుట్రను భగ్నం చేయాలంటే మీరంతా మరోమారు టీడీపీకి ఓట్లు వేస్తారా తమ్ముళ్లూ.. అని బాబు అడగ్గా ఏమాత్రం స్పందన రాలేదు. సభ 20 నిమిషాల్లో ముగించి వెళ్లిపోవడంతో టీడీపీ నాయకుల్లో జోష్‌ కనిపించలేదు.      

మరిన్ని వార్తలు