'విశాఖ వద్దంటే.. బీసీల అభ్యున్నతిని అడ్డుకున్నట్టే'

25 Dec, 2019 20:10 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగానే విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ప్రతిపాదన వచ్చిందని, చంద్రబాబు నాయుడు వద్దంటే బీసీల అభ్యున్నతికి అడ్డుకున్నట్లేనని ఆలిండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడు ప్రాంతాల అభివృద్ధికి తీసుకొన్న నిర్ణయాన్ని బీసీ సంఘాలు స్వాగతిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల బీసీలకు కలిగిన నష్టాన్ని సీఎం జగన్ పూడ్చుతున్నారని తెలిపారు. 

85 శాతం మంది బీసీలు ఉన్న ఉత్తరాంధ్రలో రాజధాని నిర్మాణం.. బీసీల అభ్యున్నతికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో బీసీలకు ఏడాదికి రూ. 10 వేల కోట్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు.. ఐదేళ్ల పాలనలో రూ. పది వేల కోట్లను వెచ్చించలేదంటూ ఆరోపించారు. బీసీల ఓట్లతో అధికారం చెలాయించిన పార్టీలు పట్టించుకోకపోగా.. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టి ఒక చారిత్రక ప్రయత్నం చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆలిండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పిల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు