అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

6 Feb, 2020 04:17 IST|Sakshi
అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష 

సర్వేల పేరుతో ఎగ్గొట్టకుండా ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించాం 

సచివాలయాలు సమర్థంగా పనిచేస్తేనే మన కలలు సాకారం అవుతాయి 

న్యాయం జరగాల్సిన సమయంలో జరగకపోతే అది కూడా తప్పే అవుతుంది 

సచివాలయాల ద్వారా అందే అభ్యర్థనలను కార్యదర్శులు సకాలంలో పరిష్కరించాలి 

గడువులోగా సమస్యలు పరిష్కరించకుంటే విశ్వసనీయత కోల్పోతాం  

మనం చాలా పారదర్శకంగా పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెబుతున్నాం. దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల్లోగా పరిష్కరిస్తామో కూడా చెబుతున్నాం. అయినా సరే కొన్ని పత్రికలు, చానళ్లు నిజాలు దాచి నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నాయి. వాస్తవాలు, సరైన సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా అధికారులు, ఉద్యోగులు చొరవ చూపాలి.
– సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ 

సాక్షి, అమరావతి: కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇతర పథకాల లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగిందని గర్వంగా చెప్పగలమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సాధికార సర్వే, ఇతర సర్వేల పేరుతో ఎగ్గొట్టకుండా వలంటీర్ల సాయంతో ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే దరఖాస్తు విధానంపై సచివాలయాల్లో అవగాహన కల్పిస్తున్నామని గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థపై సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. 

సీఎం సమీక్ష వివరాలు ఇవీ.. 
- గ్రామ సచివాలయాల్లో ప్రతి రోజూ ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు, విజ్ఞాపన పత్రాలను స్వీకరించి రశీదు ఇస్తున్నారు. వీటిని నిర్దేశిత సమయంలోగా పరిష్కరించకుంటే విశ్వసనీయత కోల్పోతామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో కలెక్టర్లు, సంబంధిత శాఖల కార్యదర్శులు చురుగ్గా స్పందించాలి. 
దరఖాస్తు ఏ దశలో ఉంది? ఎప్పుడు పరిష్కారం అవుతుందో ఫోన్‌ కాల్స్‌ ద్వారా తెలియచేయాలి.  
గ్రామ సచివాలయాలు సమర్థవంతంగా పనిచేస్తేనే మన కలలు సాకారం అవుతాయి. అప్పుడే సంతృప్త స్థాయిలో కార్యక్రమాలు, పథకాలు అమలవుతాయి.  
రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యే వరకు ఆయా విభాగాలకు చెందిన సచివాలయ ఉద్యోగులు కూడా గ్రామ సచివాలయాల్లో ఉండాలి. 
గ్రామ సచివాలయం నుంచి సంబంధిత పోర్టల్‌లో అందే అభ్యర్థనలపై అన్ని శాఖల కార్యదర్శులు 
వెంటనే స్పందించాలి. లేదంటే దరఖాస్తుదారులది అరణ్య రోదనే అవుతుంది. ఇలాంటి పరిస్థితి 
తలెత్తకూడదు. 
సచివాలయాల్లో 541 సేవలను నిర్దేశిత వ్యవధిలోగా అందిస్తామని బోర్డులు ఏర్పాటు చేశాం. మనం తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు, ఉద్యోగులు గౌరవించేలా వ్యవహరించాలి.  
- గ్రామ సచివాలయాల నుంచి అందే విజ్ఞాపనలు, దరఖాస్తులపై ప్రతి శాఖలో పర్యవేక్షణకు ఒకరిని నియమించాలి.  
దరఖాస్తులు, విజ్ఞాపనలను పట్టించుకోలేదంటే ఆ శాఖలో సమస్య ఉన్నట్లే. 
- గ్రామ సచివాలయం నుంచి ప్రతి విభాగానికి దరఖాస్తులు, విజ్ఞాపనలు ఎన్ని  వచ్చాయనే సమాచారం నేరుగా నాకు (సీఎం) కూడా అందుతుంది. సీఎం కార్యాలయం వీటిని పర్యవేక్షిస్తుంది.  
ఈ ప్రక్రియలో ఎక్కడైనా ఆలస్యం జరిగితే పేదలు, సామాన్యులు నష్టపోతారని  గుర్తుంచుకోవాలి.  
న్యాయం జరగాల్సిన సమయంలో జరగకపోతే అది కూడా తప్పే అవుతుంది. ఆ పరిస్ధితి రాకుండా సచివాలయం నుంచి వచ్చే అభ్యర్థనలను సంబంధిత కార్యదర్శులు త్వరగా పరిష్కరించాలి.  
- వివిధ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు, లబ్ధిదారుల ఎంపిక అంతా నిర్దిష్ట విధానం ప్రకారం జరగాలి.  
పథకాన్ని అమలు చేసే శాఖ మార్గదర్శకాలు, అర్హతల వివరాలను నేరుగా గ్రామ సచివాలయాలకు పంపించాలి. ఈ వివరాలతో పోస్టర్లను రూపొందించి సచివాలయాల్లో ప్రదర్శించాలి.  
- అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  
- ఒక పథకం అమలుకు నెలరోజుల ముందుగా సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లకు సమగ్రంగా శిక్షణ పూర్తి కావాలి.  
- ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉన్నప్పుడు మనం వేరే వ్యవస్థలపై ఆధారపడటంలో అర్థం లేదు.  
ప్రజల నుంచి అందే విజ్ఞాపనల పరిష్కారంలో నాణ్యత ఉండాలి. ప్రభుత్వ పాలనను ప్రజల 
గడప వద్దకే చేర్చాలి.  
- పథకాల అమలులో ఏమాత్రం అవినీతి కనిపించకూడదు. ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకునే విధానం ఉండాలి. మూడో పార్టీ తనిఖీలు సమర్థంగా జరగాలి.  
- సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థపై నెలకోసారి సమీక్షా సమావేశం నిర్వహించాలి. 
- వలంటీర్లకూ అటెండెన్స్‌ విధానం తీసుకురావాలి. ఆన్‌లైన్‌లో అటెండెన్స్‌ తనిఖీ ఉండాలి.  
- పీరియాడికల్‌ ఇండికేటర్స్‌ వల్ల వలంటీర్లు నిరంతరం చురుగ్గా వ్యవహరించడంతోపాటు పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందుతాయి. 

>
మరిన్ని వార్తలు