ఇక ఆటోమ్యుటేషన్‌

12 Feb, 2020 02:44 IST|Sakshi
సచివాలయంలో ఆటో మ్యుటేషన్‌ సేవల పోస్టర్‌ను విడుదల చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తదితరులు

రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే మీభూమి పోర్టల్‌లో తాత్కాలిక నమోదు 

రిజిస్ట్రేషన్‌ జరిగిన నెలలోనే శాశ్వత భూయాజమాన్య హక్కుల మార్పిడి

ఆటోమ్యుటేషన్‌ సేవల పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్‌) విషయంలో అవినీతిరహిత, పారదర్శక, సులభతర, సత్వర సేవల దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్‌ దస్తావేజుల తయారీలో అవినీతి, దళారుల ప్రమేయం లేకుండా ఎవరి దస్తావేజులు వారే రాసుకునే పబ్లిక్‌ డేటా ఎంట్రీ (పీడీఈ) విధానాన్ని ఇటీవల అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం తాజాగా ఆటోమ్యుటేషన్‌ ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆటోమ్యుటేషన్‌ సేవల పోస్టర్‌ను మంగళవారం సచివాలయంలో విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారు రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్ల నమోదు (మ్యుటేషన్‌) కోసం మీసేవ కేంద్రాలకు వెళ్లి.. నిర్ధిష్ట రుసుం చెల్లించి.. పత్రాలన్నీ స్కాన్‌ చేసి సమర్పించాల్సి వస్తోంది. తర్వాత మళ్లీ తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరగడమే కాకుండా.. అక్కడి సిబ్బందికి ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోంది. 

ఎటువంటి ఫీజు చెల్లించకుండానే..
ఇకపై రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే ఆ భూములను కొనుగోలుదారుల పేరుతో తాత్కాలికంగా నమోదు చేసేలా రిజిస్ట్రేషన్‌ అధికారులకు వీలు కల్పిస్తూ ‘ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కులు, పట్టాదార్‌ పాస్‌బుక్‌ చట్టం – 1971’ను ప్రభుత్వం సవరించింది. ఇక నుంచి భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారు ఆన్‌లైన్‌లోనూ, రెవెన్యూ రికార్డుల్లోనూ వారి పేర్ల నమోదు (మ్యుటేషన్‌) కోసం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. దరఖాస్తు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. అధికారులే రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే మీభూమి పోర్టల్‌ (ఆర్‌ఓఆర్, 1బి, అడంగల్‌)లో తాత్కాలిక ప్రాతిపదికన నమోదు చేస్తారు. తదుపరి ఆ లావాదేవీపై అభ్యంతరాల స్వీకరణకు రెవెన్యూ అధికారులు 15 రోజులు గడువు ఇస్తారు. తర్వాత తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసి నెల రోజుల్లో శాశ్వత మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ భూమార్పిడి వివరాలను  meebhoomi. ap. gov. in లో చూసుకునే సదుపాయాన్ని కల్పించారు.  

ప్రయోగాత్మకంగా మొదట కృష్ణా జిల్లా కంకిపాడులో..
ఆటోమ్యుటేషన్‌ను మొదట కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఇప్పుడు దీన్ని రాష్ట్రమంతా అమల్లోకి తెచ్చింది. నూతన విధానం ప్రకారం.. భూబదలాయింపు ప్రక్రియ ప్రతి దశలో పట్టాదారు మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. రిజిస్ట్రేషన్‌ జరిగిన 30 రోజుల్లో తహసీల్దార్‌ ధ్రువీకరించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తారు. తర్వాత ఎలక్ట్రానిక్‌ పట్టాదారు పాస్‌ పుస్తకాన్ని మీభూమి వెబ్‌సైట్‌ నుంచి ప్రజలు నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.     
– శ్రీధర్, రాష్ట్ర భూపరిపాలన సంయుక్త కమిషనర్‌  

>
మరిన్ని వార్తలు