పటిష్టంగా లాక్‌ డౌన్‌

24 Mar, 2020 03:38 IST|Sakshi

అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌

నిత్యావసరాలకు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి

అది కూడా ఇంటికి ఒక్కరే, 3.కి.మీ పరిధి వరకే అనుమతి

అత్యవసరమైతే తప్ప ఇల్లు విడిచి రాకుండా చర్యలు తీసుకోవాలి

ఈ దిశగా అందరినీ సమాయత్తం చేయాలి

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ ఇంటికి పరిమితం కావాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తేనే వైరస్‌ వ్యాపించడం తగ్గుముఖం పడుతుంది. అయితే అక్కడక్కడ కొంత మంది దీనిని పాటించడం లేదని తెలుస్తోంది. ఇంట్లో ఉండటమే శ్రేయస్కరం అని, కనీస బాధ్యత అని అందరికీ తెలియజెప్పాలి.
–సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : ఈ నెలాఖరు వరకు లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలకు ఇంటికి ఒక్కరి చొప్పున, అది కూడా మూడు కిలోమీటర్ల పరిధి వరకే అనుమతించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ అమలవుతున్న తీరుపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య, పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితి, పాజిటివ్‌ కేసుల వివరాలు, వారు కోలుకుంటున్న తీరు గురించి ఈ సందర్భంగా అధికారులు వివరించారు. సమీక్షలో చర్చకు వచ్చిన అంశాల్లో మరికొన్ని..
వైద్య, ఆరోగ్య, పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

అన్ని విధాలా సన్నద్ధం
- కరోనా సోకిన 80.9 శాతం మంది ఐసోలేషన్లోనే ఉంటూ కోలుకుంటున్నారు. 13.8 శాతం మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. వారిలో 4.7 శాతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ వైద్యం కోసం విశాఖపట్నంలో విమ్స్, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని ఆస్పత్రుల్లో దాదాపు 1,300 బెడ్లు అందుబాటులోకి వస్తున్నాయి.  
- 150 వెంటిలేటర్స్‌తో ఐసీయూ యూనిట్లకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. త్వరలో అదనంగా మరో 200 వెంటిలేటర్స్‌తో ఐసీయూ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు.  ప్రైవేటు ఆస్పత్రుల్లో 450 వెంటిలేటర్స్‌ను సిద్ధం చేసేలా ప్రయత్నాలు ప్రారంభం.
- ప్రతి జిల్లా ఆస్పత్రిలో 100 నుంచి 200 బెడ్లు సిద్ధంగా ఉంచనున్నారు. మొత్తంగా దాదాపు 2 వేల బెడ్లు సిద్ధం చేస్తున్నారు. కరోనా సోకిన వృద్ధుల ఆరోగ్య పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్నందున వారికి మంచి వైద్యం అందించేందుకు చర్యలు. 
- ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప ఎవరూ ఇల్లు విడిచి బయటకు రాకుండా పోలీసులు అన్ని చర్యలూ తీసుకోవాలి.

ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు బంద్‌ 
- ఇతర రాష్ట్రాల నుంచి ఏ వాహనాలు రాకుండా అడ్డుకోవాలి. గూడ్సు, నిత్యావసర వస్తువులతో కూడిన వాహనాలు తప్ప ఏవీ తిరగరాదు.
- నిత్యావసర దుకాణాలు తప్ప మిగతావన్నీ మూసేయాలి. కనీస అవసరాలు కొనుగోలు చేసేందుకు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే వచ్చేలా చూడాలి.   
- ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకున్నప్పుడు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా వైద్య ఆరోగ్య శాఖ సూచనలు పాటించాలి.
- క్షేత్ర స్థాయిలో కోవిడ్‌ –19 నివారణ చర్యలపై నిరంతరం పర్యవేక్షించాలి. అన్ని శాఖల అధికారులు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలి. 
- సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంసీ చైర్మన్‌ సాంబశివారెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్‌ పాల్గొన్నారు.  

కరోనా అలర్ట్‌ 
- లాక్‌డౌన్‌   నిబంధనలను ఉల్లంఘించిన వారిని ఆరు నెలలు జైలుకు పంపడంతో పాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. సోమవారం రాత్రి  పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

- నిత్యావసరాలు, మందుల షాపులు, పెట్రోలు బంకులు  తెరిచే ఉంటాయి.  రైతు బజార్లకు వారానికి ఒకసారిచ్చే సెలవును రద్దు చేశారు. 3 కి.మీ. పరిధిలోనే నిత్యావసరాలు కొనాలి. రాత్రి 8 గంటల తర్వాత ఈ విక్రయాలు నిషేధం.  

- నిత్యావసరాల కొనుగోలుకు కుటుంబం నుంచి ఒకరు మాత్రమే తగిన జాగ్రత్తలతో బయటకు రావాలి. వృద్ధులు, చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితిలోనూ బయటకు పంపకండి. 

- ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులు కూడా పూర్తిగా మూసివేశారు. ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దు.  

- పేదలకు ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన బియ్యం, ఒక కేజీ కందిపప్పు రేషన్‌ కార్డుదారులకు ఈనెల 29న ఉచితంగా ఇస్తారు. దీంతోపాటు రూ. 1000 నగదు కూడా ఇస్తారు. 

- ఈ నెల 31వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల ప్రశ్నపత్రాలు, ఇతర మెటీరియల్‌ సరఫరా వాహనాలకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.  

- బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకే పనిచేస్తాయి. ఆన్‌లైన్‌ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.  అలాగే ప్రజల సౌకర్యార్థం ఏటీఎంలు పనిచేస్తాయి.  టెలికామ్, ఇంటర్‌నెట్, పోస్టల్‌ సేవలు కొనసాగుతాయి. 

చదవండి: లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు

మరిన్ని వార్తలు