బరుల్లో ‘కోట్లా’ట

15 Jan, 2015 03:19 IST|Sakshi
బరుల్లో ‘కోట్లా’ట

సాక్షి ప్రతినిధి, ఏలూరు :ఊహించినట్టుగానే పందెం కోడే గెలి చింది. ఏటా మాదిరిగానే ముందువరకూ ఉత్కంఠ నెలకొన్నా సంక్రాంతి సంబరాల తొలి రోజు భోగినాడు జిల్లావ్యాప్తంగా పందెం కోళ్లకు రెక్కలు తెగాయి. నోట్ల కట్టలు తెగిపడ్డాయి. బరుల్లో కోట్లాది రూపాయల మేర పందాలు సాగాయి. హైకోర్టు ఉత్తర్వులు, దానిపై సుప్రీం కోర్టు స్పందన ఎలా ఉన్నా జిల్లాలోని బరులు పందెం రాయుళ్లు, జూదగాళ్లు, వాటిని చూసేందుకు వచ్చే ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. వాస్తవానికి బుధవారం ఉదయం వరకు పందాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలీసులు కూడా ఎక్కడా పందాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బరులు సిద్ధం చేసిన ప్రాం తాల్లో అప్రమత్తమయ్యారు.
 
 సరిగ్గా ఉదయం 11గంటల సమయంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఏలూరులో డీఐజీ హరికుమార్‌ను కలిసి బయటకు వచ్చి పందాలకు ఇబ్బందుల్లేని వ్యాఖ్యానించారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో అప్పటివరకు బరుల వద్ద పదుల సంఖ్యలో పహరా కాసిన పోలీసులు ఉన్నట్టుండి వెనుదిరిగారు. ఆ తర్వాత నుంచి బరుల్లో కోడి పందాలు హోరెత్తాయి. వీటి ముసుగులో జూదాలు, గుండాట, బెట్టింగ్‌లకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. మద్యం ఏరులై పారు తోంది. చాలా బరుల్లో రాత్రివేళ జనరేటర్లు పెట్టి  ఫ్లడ్ లైట్ల వెలుతురులో పం దాలు ఆడుతున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయే నాటికి జిల్లావ్యాప్తంగా రూ.60 కోట్లు చేతులు మారాయనేది ఓ అంచనా. భోగి నాడు మొదలైన పందాలు, జూదాలు గురు, శుక్రవారాల్లో కూడా జోరుగా సాగుతాయని, మొత్తంగా మూడు రోజుల్లో రూ.200 వందల కోట్లు చేతులు మారతాయని అంచనా.
 
 చింతమనేని, వేటుకూరితో మొదలు
 దెందులూరు నియోజకవర్గం కొప్పాకలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్,  కలవపూడిలో ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు బుధవారం 12గంటల సమయంలో కోడి పందాలను లాంఛనంగా ప్రారంభిం చారు. డెల్టాలోని ప్రధాన బరులుగా పేరు గాంచిన వెంప, భీమవరం ప్రక్రృ తి ఆశ్రమం, ఐ.భీమవరం, మహదేవపట్నం, పూలపల్లి తదితర బరుల్లో మధ్యాహ్నం 12 గంటల తరువాత కోడి పందాలు ప్రారంభమయ్యాయి. భీమవరం మండలం వెంప బరిలో బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త పురిఘళ్ల రఘురామ్, కనుమూరి రఘురామకృష్ణంరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ, అల్లుడు ప్రశాంత్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఈ గ్రామంలో జరిగిన రెండు ప్రధాన బరుల్లో సుమారు రూ.8 కోట్ల మేర కోడి పందాల లావాదేవీలు జరిగినట్టు తెలిసింది.
 
 భోగి రోజు వరకు జిల్లాలో  భీమవరం మండలం వెంపలో నిర్వహించిన పందాలే హైలైట్‌గా నిలిచాయని అంటున్నారు.  కాగా, ఏటా పెద్దఎత్తున పందాలు సాగే భీమవరం ప్రకృతి ఆశ్రమంలోని ప్రధాన బరిలో మొదటి రోజు పం దాలు నిర్వహించలేదు. ఐ.భీమవరంలో కూడా నామమాత్రంగా నిర్వహించారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని సీసలి, ఐ.భీమవరం, మహదేవపట్నం, యండగండి, కోలమూరులలో భారీగా పందాలు జరిగాయి. ఇక్కడ సుమారు రూ.7 కోట్లు చేతుల మారాయని తెలుస్తోంది. చింతలపూడి మండలం రాఘవాపురం, పాతచింతలపూడిల్లో కోడిపందాలు  జోరుగా జరి గాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, లింగపాలెం, అయ్యపరాజుగూడెం, ములగలంపాడు, సింగగూడెంలో భారీ పందాలు జరిగాయి. ఇక్కడ తొలిరోజే దాదాపుగా కోటి రూపాయలు చేతులు మారినట్టు అంచనా.
 
 గుండాటను తిలకించిన ఎమ్మెల్యే జవహర్
 కొవ్వూరు నియోజకవర్గంలో దాదాపుగా 12 బరుల్లో కోడిపందాలు జరిగాయి. కొవ్వూరు పట్టణంలో కోడి పందాలను ఎమ్మెల్యే కేఎస్ జవహర్ ప్రారంభించి గుండాటను తిలకించారు. ఇక్కడ రూ.50 లక్షల వరకు చేతులు మారాయని అంచనా. నరసాపురం నియోజకవర్గంలో మూడుచోట్ల జరిగిన కోడిపందాల్లో దాదాపు రూ.20 లక్షలు చేతులు మారాయని అంటున్నారు. పాలకొల్లు నియోజకవర్గం పూలపల్లి, కలగంపూడి గ్రామాల్లో భారీ పందాలు జరిగాయి. పూలపల్లిలో పందాలను నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు తిలకించారు.
 
 వెంపలో భారీ పందాలు
 భీమవరం : భీమవరం మండలం వెంపలో రెండుచోట్ల పోటాపోటీగా నిర్వహించిన కోడి పందాల్లో తొలిరోజున రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేర పందాలు సాగారుు. బయట పందాలు సైతం భారీగానే జరిగారుు. ఇది జిల్లాలోనే రికార్డు అని పందాల రాయుళ్లు చెబుతున్నారు. ఒక బరిలో 50 పందాలు వేయగా, రెండో బరిలో 30 వరకూ పందాలు పడ్డారుు. డెల్టాలో ప్రతిచోటా పెద్దఎత్తున కోడి పందాలు వేశారు. ఒక్కొక్క కోడిపై రూ .50 వేల నుంచి రూ.2 లక్షల వరకు బెట్టింగ్‌లు జరిగారుు. ప్రతి చోట బరులకు సమీపంలోనే బెల్ట్ షాపులు ఏర్పాటుచేసి మద్యం అమ్మకాలు సాగించారు. గుండాట, పేకాట, కోతాట, బాలాట, రంగాటలు పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. వీటిటో యువత పెద్దఎత్తున సొమ్ములను ఒడ్డి జేబులు గుల్ల చేసుకున్నారు.
 
 నోటీసులిస్తాం : లాయర్ రాయల్
 హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కోడిపందాలు వేసిన వారికి, ప్రోత్సహించిన నాయకులకు లీగల్ నోటీసులు పంపిస్తామని ఏలూరుకు చెందిన న్యాయవాది పీడీఆర్ రాయల్ చెప్పారు. వార్తా ఛానళ్లలో ప్రసారమైన కథనాల  క్లిప్పింగ్‌లు, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పందాలరాయుళ్లకు నోటీసులు ఇస్తామని తెలిపారు. పండగ మూడురోజుల తర్వాత ఎవరూ పట్టించుకోరనే ధీమాతోనే జూదగాళ్లు తెగిస్తున్నారని, అందుకే తాము పండగ తర్వాతే ఈ విషయమై అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పారు. చట్టప్రకారం పని చేస్తున్న జిల్లా పోలీసులపై రాజకీయ నేతలు ఒత్తిడి తేవడం దారుణమన్నారు. ఈ విషయంలో కోర్టు ధిక్కారం కింద సదరు నేతలపై కేసులు నమోదు చేయాలని రాయల్ డిమాండ్ చేశారు.

 

మరిన్ని వార్తలు