భారీ చోరీ | Sakshi
Sakshi News home page

భారీ చోరీ

Published Thu, Jan 15 2015 3:34 AM

robbery in Tangellamudi

తంగెళ్లమూడి (ఏలూరు రూరల్):వరుస చోరీలతో జిల్లా పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు రాత్రికి రాత్రికి ఏలూరులో ఓ కార్పొరేటర్ ఇంటిని లూటీచేశారు. సుమారు రూ.15 లక్షల విలువ చేసే 40 కాసుల బంగారం, 3 కిలోల వెండి ఆభరణాలు, రూ.40 వేల నగదును దొంగిలించారు. భోగి పండగ నాడు వెలుగుచూసిన ఈ సంఘటన స్థానిక ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు 2వ డివిజన్ కార్పొరేటర్ గవ్వా మధుసూదనరావు తంగెళ్లమూడిలోని ద్వారకానగర్‌లో నివసిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం గత సోమవారం రాత్రి 10 గంటల సమయంలో భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. పనిముగించుకుని మంగళవారం రాత్రి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. తాళం చెవితో తలుపు తీసేందుకు ప్రయత్నించగా తలుపు తేలికగా తెరుచుకుంది. దీంతో అనుమానం వచ్చిన మధుసూదనరావు, ఆయన భార్య ఆందోళనగా ఇల్లంతా పరిశీలించారు. బెడ్‌రూమ్‌లో బీరువా తెరిచి, దుస్తులు, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరు వా లాకర్ పగిలి మంచంపై పడి ఉంది. దీంతో చోరీ జరిగినట్టు గుర్తించిన వారు పోలీసులను ఆశ్రయించారు. సుమారు రూ.15 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు మధుసూదనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిలో పిల్లల చేతి ఉంగరాలు, తన భార్య గాజులు, మరికొన్ని ఆభరణాలు, రూ. 40 వేల నగదు ఉన్నట్టు పేర్కొన్నారు.
 
 క్లూస్ టీం పరిశీలన
 ఏలూరు రూరల్ ఎస్సై జి.ఫణీంద్ర, సీఐ ఎ.నాగమురళి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తనిఖీలు చేశాయి. పోలీసులు బీరువాలో చేతి బ్యాగ్, బట్టల సంచిని జాగిలానికి వాసన చూపించారు. జాగిలం ఇళ్లంతా సంచరించి అక్కడ నుంచి బీడీ కాలనీ మీదుగా సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిచ్చుకల నాగేశ్వరరావు లే-అవుట్ వైపు వెళ్లింది. అక్కడే సమీప  నిర్మాణంలో ఉన్న ఓ ఇల్లు, కొబ్బరికాయలు ఒలిచే షెడ్డులో కలియతిరిగింది. ఆఖరిగా పక్కనే ఉన్న జాతీయ రహదారి వైపు వెళ్లి తిరుగుముఖం పట్టింది. దీంతో దొంగలు హైవే మీదుగా పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లోని బీరువా, పరిసరాలపై వేలిముద్రలను క్లూస్ టీం సేకరించింది. ఇనుప లివర్‌తో తలుపు చెక్క పగులగొట్టి తాళం తెరిచినట్టు పోలీసులు గుర్తించారు. అనుభవం ఉన్న దొంగలే చోరీ చేసి ఉంటారని  భావిస్తున్నారు. సీసీఎస్ డీఎస్పీ ఐ.సత్యనారాయణ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.
 
 తణుకులో సినీ ప్రముఖుల సందడి
 తణుకు మండలం మండపాకలో జరిగిన కోడి పందాలను సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి, మ్యూజిక్ డెరైక్టర్ కోటి తిలకించారు. నిడదవోలు  ప్రాంతంలో జరిగిన పందాలను చూసేందుకు హీరో తనిష్, పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు విచ్చేశారు. తణుకు, నిడదవోలు ప్రాంతాల్లో జరిగిన పందాల్లో రూ.కోటి వరకు చేతులు మారాయని అంచనా. తాడేపల్లిగూడెం మెట్ట,  ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర మండలాల్లో కోడి పందాలు, జూదం జోరుగా సాగాయి.  ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం, బాదంపూడి, నాచుగుంట, వెల్లమిల్లి, గుండుగొలనులో భారీ స్థాయిలో కోడి పందాలు సాగాయి. గుండుగొలనులో ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పందాలు ప్రారంభించారు. గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లి,  చిన్నాయగూడెం, యర్నగూడెం, కొవ్వూరుపాడు, దొండపూడి, హుకుంపేట, బాపులపాడు, నల్లజర్ల మండలం దూబచర్ల, పోతిరెడ్డిపాలెం, అనంతపల్లిలో బరులు ఏర్పాటు చేసి పందాలు భారీగా నిర్వహించారు. ద్వారకాతిరుమల మండలం మారంపల్లి, తిమ్మారావుగూడెం, దొరసానిపాడు, కొమ్మర, పంగిడిగూడెం శివారు గ్రామాల్లో జోరుగా కోడి పందాలు సాగాయి.
 

Advertisement
Advertisement