మిర్చియార్డులోకోల్డ్ వార్

25 Feb, 2014 00:41 IST|Sakshi
మిర్చియార్డులోకోల్డ్ వార్

 36 మంది కమీషన్ ఏజెంట్లకు నోటీసులు
 మరో 100 మందిపై కొర్రీలు పెడుతూ నివేదికలు
 కాసుల కోసం అధికారుల కొత్త వలలు
 సమంజసం కాదని తెగేసి చెప్పిన ఏజెంట్ల సంఘం
 
 గుంటూరు మిర్చియార్డులో కమీషన్ ఏజెంట్లు, అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అదనపు ఆదాయం, అనధికార కాసుల కోసం అధికారులు వల విసరడం, నిబంధనల పేరిట తరచూ వేధింపులకు గురిచేయడం పలువురు కమీషన్ ఏజెంట్లకు తలనొప్పిగా మారింది. ఇటీవల యార్డు అధికారులు 36 మంది కమీషన్ ఏజెంట్లకు నోటీసులు జారీ చేయడం, వివరణ ఇచ్చిన తరువాత కూడా అధికారులు సరైన విధంగా స్పందించక పోవడం మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. తాజా వివాదానికి ఈ అంశమే కారణంగా కనిపిస్తోంది.
 
 సాక్షి, గుంటూరు
 మిర్చియార్డులో మొత్తం 582 మంది కమీషన్ ఏజెంట్లు లెసైన్సులు కలిగి ఉన్నారు. ఇందులో 193 మంది ఏజెంట్ల లై సెన్సుల కాలపరిమితి 2013 మార్చి 31తో ముగిసింది. వీరందరూ ఐదేళ్లకు ఒకేసారి లెసైన్సు ఫీజు చెల్లించి తమకున్న రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంది.  అయితే కమీషన్ ఏజెంట్ల భాగస్వామ్య బదిలీల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం వీరి లెసైన్సుల రెన్యువల్స్‌ను నిలిపివేసింది.
 ఆ తరువాత కమీషన్ ఏజెంట్లు పెద్ద మొత్తంలో సొమ్మును పైఅధికారులకు ముట్టజెప్పినట్లు వినికిడి. నెలలు గడుస్తున్నా లెసైన్సుల రెన్యువల్ పనులు జరగకపోవడంతో లోలోపలే ఆయా కమీషన్ ఏజెంట్లు కుతకుతలాడుతున్నారు. సమయం వచ్చినపుడు అధికారుల్ని నిలదీయాలని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యార్డు అధికారులు మరో 36 మందికి ముందస్తు సమాచారం, హెచ్చరికలు లేకుండా నోటీసులు జారీ చేశారు. వ్యాపారం చేస్తున్న ప్లాట్లు రిజిస్టర్డ్ ప్లాట్లు కావనీ, అనధికార వ్యాపారాలు జరుపుతున్నారంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపైఆయా ఏజెంట్లు సరైన వివరణ ఇచ్చినా అధికారులు స్పందించలేదని సమాచారం. ఇదిలా ఉండగా అత్యవసరంగా కార్యాలయానికి వచ్చి సమాధానం చెప్పాలని సోమవారం ఫోన్ చేయడం కమీషన్ ఏజెంట్లకు ఇబ్బందికరంగా మారిందిఅంతేకాకుండా మరో 100 మంది ఏజెంట్ల లెసైన్సుల విషయంలోనూ కొర్రీలు పెడుతూ నివేదికలు తయారు చేయడం కూడా వీరికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఏజెంట్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కిలారు రోశయ్య, శివరామిరెడ్డితో పాటు ముఖ్యమైన మిర్చి ఏజెంట్లు కొందరు సోమవారం మధ్యాహ్నం యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి నరహరిని కలిసి తమ వాదన వినిపించారు. వివిధ కారణాలతో కమీషన్ ఏజెంట్లను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని తెగేసి చెప్పినట్లు సమాచారం.
 
 మరికొంత పిండేందుకేనా.. ఇదిలాఉండగా యార్డు అధికారులు, పాలక వర్గంలోని పలువురు సభ్యులు అదనపు ఆదాయం పైనే దృష్టి సారించారన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల కిందట కమీషన్ ఏజెంట్ల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు అందుకున్న కొందరు పైస్థాయి అధికారుల సహకారంతో మరోసారి వల విసిరేందుకు యార్డులోని అధికారులు, పాలకవర్గ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే సోమవారం కమీషన్ ఏజెంట్లను పిలిపించారని సమాచారం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు