బండ బాదుడుపై మండిపాటు

5 Jan, 2014 00:19 IST|Sakshi

 కలెక్టరేట్, న్యూస్‌లైన్:
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలనతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్యాస్, పెట్రోలు ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి హెచ్చరించారు. శనివారం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ జిల్లా యువత అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు కట్టెల పొయ్యిపై వంట చేసి తమ నిరసన తెలిపారు. అనంతరం ధర్నాలో పాల్గొన్నవారినుద్దేశించి బట్టి జగపతి మాట్లాడుతూ, సర్కార్.. మూడు నెలల కాలంలో మూడు సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాసు ధరలను పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు కట్టెల పొయ్యితో ఇబ్బందులు పడుతూ వంటలు చేయటాన్ని చూసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహిళలకు గ్యాస్ పంపిణీ చేశారనీ, కేంద్రం గ్యాస్‌బండపై ఒక్కసారి రూ.50 పెంచితే, ఆ భారాన్ని కూడా మహిళలపై ఆయన పడనీయలేదన్నారు.
 
  ఆ మహానేత మరణానంతరం సీఎం పదవి చేపట్టిన రోశయ్య, కిరణ్‌కుమార్‌లు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. పెరిగిన ధరలకు సామాన్యులు గ్యాసు కూడ తెచ్చుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల వ్యవసాయం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై పెను ప్రభావం చూపుతుందన్నారు. మహిళల కన్నీళ్లను చూస్తున్న పాలకులు కాలగర్భంలో కలవడం ఖాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. వైఎస్సార్ సీపీ యువత విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ, సీల్డ్ కవర్ సీఎంకు సమాన్యుల ఘోష పట్టదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ సామాన్యుల పక్షాన పోరాడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయన్నారు.
 
 పేదల కోసం రాజకీయాలకతీతంగా పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు నర్ర బిక్షపతి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వ్యామోహంలోపడి ప్రజల బాగోగులు విస్మరించారన్నారు. ప్రజలకోసమే ఉద్భవించిన వైఎస్సార్‌సీపీ వారి పక్షాన రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైఎస్సార్ సీపీ నేతలు కలెక్టర్ స్మితా సబర్వాల్‌కు అందజేశారు.  కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్మిక సెల్ అధ్యక్షులు నర్రా బిక్షపతి, బీసీసెల్ రాష్ట్ర నాయకుడు సతీష్‌గౌడ్, పార్టీ నాయకులు రమేశ్, రాజేశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, భవానీశంకర్, దత్తు, సంతోష్, బస్వరాజ్, బంటి, రాజ్‌కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు