ప్రకాశించిన సాధికారత 

23 Nov, 2023 04:37 IST|Sakshi
ప్రకాశం జిల్లా ఒంగోలు సాధికార సభకు తరలివచ్చిన అశేష జనవాహినిలో ఓ భాగం

ఒంగోలులో పండుగలా సామాజిక సాధికార బస్సు యాత్ర 

జనసంద్రమైన ఒంగోలు నగరం.. అడుగడుగునా నీరాజనాలు 

ప్రత్యేక ఆకర్షణగా కుల వృత్తుల శకటాలు  

వర్షంలో తడుస్తూనే యాత్ర, సభలో పాల్గొన్న ప్రజలు 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంలో సామాజిక సాధికారత ప్రకాశించింది. సామాజిక చైతన్యం ఉవ్వెత్తున ఎగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు రోడ్లపైకి చేరి పండుగ చేసుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను ప్రతిబింబిస్తూ నగరంలోని బడుగు, బలహీనవర్గాలు బుధవారం పెద్ద ఎత్తున సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. ఒకప్పుడు అవమానాలకు గురైన తాము సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ భరోసాతో తలెత్తుకు తిరుగుతున్నామంటూ నినదించారు.

జోరు వానలోనూ బస్సు యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. నగర వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భారీ గజమాలలు, సంప్రదాయ నృత్యాలు, డప్పుల మోతలు, బాణాసంచాతో జై జగన్‌ నినాదాలతో ఒంగోలు నగరం మార్మోగింది. కర్నూలు బైపాస్‌ రోడ్డు నుంచి అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు ర్యాలీ సాగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కుల వృత్తులు ప్రతిబింబించేలా శకటాలను యాత్రలో ప్రదర్శించారు. అనంతరం ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్‌ సెంటర్‌లో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 
సభలో మాట్లాడుతున్న మంత్రి మేరుగు నాగార్జున 

ఇదో సామాజిక విప్లవం: మంత్రి విడదల రజిని 
సభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ తెచ్చిన సామాజిక సాధికారతకు ఈ వేదికపై ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మంత్రులు, మేయరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నేతలే నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. మంత్రివర్గం నుంచి అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే సీఎం జగన్‌ పెద్దపీట వేశారని తెలిపారు. పేదవానికి కార్పొరేట్‌ వైద్యం, విద్య అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఇదో సామాజిక విప్లవమని అన్నారు. 

బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత చదువులు: ఎంపీ ఆర్‌.కృష్ణయ్య
ఆంధ్రాలో అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులు చదివి అమెరికా, ఆ్రస్టేలియా, కెనడా వంటి దేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. సీఎం జగన్‌ సుపరిపాలన చూశాక ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలను కూడా ఆంధ్రాలో కలపాలంటూ డిమాండ్లు వస్తున్నాయన్నారు. 

జగనన్న ఆలోచనలకు మేం నిదర్శనం: మంత్రి ఆదిమూలపు సురేశ్‌
సీఎం జగనన్న ఆలోచనా విధానానికి నిలువెత్తు నిదర్శనం ఈ సభావేదికపై ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజాప్రతినిధులమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సీఎం జగన్‌ ఉన్నతంగా తీర్చిదిద్ది, ఇంగ్లిష్‌ మీడియం చదువులు అందించడాన్ని మిగతా రాష్ట్రాలూ అందిపుచ్చుకుంటున్నాయని తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియం, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, అధునాతన ప్రభుత్వ ఆస్పత్రులతో సీఎం జగన్‌ రోల్‌ మోడల్‌గా నిలిచారన్నారు. 

సీఎం జగన్‌ పేదల పక్షపాతి: మంత్రి మేరుగు
పేదల పక్షపాతిగా సీఎం జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. వైఎస్‌ జగన్‌ 75 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారని, ఇంతకంటే సామాజిక సాధికారత చేసే నాయకులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.  

ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే పోటీ కూడా చేయను : బాలినేని 
ఒంగోలు నగర ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు 25 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడితే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వచ్చే నెలలో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా 25 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంగోలులో పోటీ కూడా చేయనన్నారు.

వైఎస్సార్‌ హయాంలో ఒంగోలులో వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మించామని తెలిపారు. ఇప్పుడు ఒంగోలు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.350 కోట్లతో మంచినీటి పథకానికి, మరో రూ.350 కోట్లతో కొత్తపట్నం మండలంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. 

ఈ సమావేశంలో ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు