అందరి ఆర్యోగానికి భరోసా

14 May, 2020 04:40 IST|Sakshi
పద్మనాభ నగర్‌లో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్న స్థానికులు

ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులకు పూర్తిస్థాయిలో వైద్య సహాయం

శాశ్వత ప్రాతిపదికన వైఎస్సార్‌ క్లినిక్‌ ఏర్పాటు

10 మంది వైద్య నిపుణులతో ప్రత్యేక కమిటీ

ప్రజలకు అన్నివేళలా అందుబాటులో వైద్యం

నోడల్‌ ఏజెన్సీగా ఆంధ్రా మెడికల్‌ కాలేజీ  

సాక్షి, విశాఖపట్నం: ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయిన, షెల్టర్ల నుంచి ఇళ్లకు వెళ్లిన ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ బాధితుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్టైరీన్‌ ప్రభావిత గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హుటాహుటిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు బాధిత గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నెల రోజులపాటు నిర్వహించనున్నారు. గ్రామాల్లో అంబులెన్స్‌లు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెనువెంటనే ఆస్పత్రులకు తరలిస్తారు. 

20 పడకలతో వైఎస్సార్‌ క్లినిక్‌ 
► వెంకటాపురం గ్రామంలో 20 పడకల సామర్థ్యంతో వైఎస్సార్‌ క్లినిక్‌ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని గ్రామాలకు అందుబాటులో ఉండేలా.. శాశ్వత భవన నిర్మాణం జరిగే వరకూ తాత్కాలికంగా ఉన్నత పాఠశాల వద్ద దీనిని నిర్వహిస్తారు. ప్రాథమిక వైద్య చికిత్స నిర్వహించేందుకు వైద్యులు, స్టాఫ్‌ నర్సులను, ఇతరత్రా నర్సింగ్‌ సిబ్బందిని నియమిస్తున్నారు.  
► గోపాలపట్నం సీహెచ్‌సీ, పెందుర్తి ప్రభుత్వాస్పత్రి రిఫరల్‌ ఆస్పత్రులుగా ఉంటాయి. అక్కడ మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు వెంటలేర్లు అందుబాటులో ఉంచారు. 
► ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ అధ్యక్షతన 10 మంది నిపుణులైన వైద్యులతో కమిటీ నియమించారు. స్టైరీన్‌ ప్రభావం వల్ల బాధితుల్లో ఎవరికైనా కళ్లు, ఊపిరితిత్తులు, శ్వాస, చర్మం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయోమే పరీక్షించేందుకు గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, పల్మనాలజిస్టు, ఆప్తమాలజిస్టు, డెర్మటాలజిస్టులతో పాటు పీడియాట్రిక్స్, కమ్యూనిటీ మెడిసిన్‌ వైద్య నిపుణులు సభ్యులుగా ఉన్నారు.  
► మానసిక సమస్యలు తలెత్తితే వైద్యమందించేందుకు సైకియాట్రిస్ట్‌ కమిటీలో ఉన్నారు. ప్రభావిత గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఈ కమిటీ వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందుకయ్యే ఖర్చులను వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వమే భరిస్తుంది.  
► గ్యాస్‌ ప్రభావిత ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలతో డేటా (బేస్‌లైన్‌ రిపోర్ట్‌) సేకరిస్తారు. దీని ఆధారంగా వైఎస్సార్‌ హెల్త్‌ మానిటరింగ్‌ కార్డు జారీ చేస్తారు. 
► ఈ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి వైద్యానికి ఆంధ్రా మెడికల్‌ కాలేజీ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.  
► రానున్న వారంలో రెండుసార్లు, తర్వాత నెలలో 15 రోజులకు ఒకసారి, ఆ తర్వాత నుంచి నెలకొకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ వివరాలతో ఏఎంసీ వద్ద డేటాను అప్‌డేట్‌ చేస్తారు.  
► అన్ని వయసుల వారికి హిమోగ్లోబిన్, లివర్, కిడ్నీల పనితీరు పరీక్షలతో పాటు ఎక్స్‌రేలు తీస్తారు. 
► గర్భిణులకు స్కానింగ్‌ చేసి తరచూ పరీక్షలు చేస్తారు. బిడ్డ పుట్టాక ఏడాదిపాటు ఎదుగుదలను పర్యవేక్షిస్తారు.. ఏడాది తర్వాత కూడా ఏమైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే జీవితాంతం వైద్యం అందిస్తారు.

15 వేల హెల్త్‌ కార్డులు
గ్యాస్‌ లీకేజీ బాధితులతో పాటు వెంకటాపురం, నందమూరి నగర్, కంపర పాలెం, ఎస్సీ, బీసీ కాలనీ, పద్మనాభ నగర్‌ గ్రామాల ప్రజలకు హెల్త్‌ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో వీటిని తయారు చేయించే పనిని అధికారులు శరవేగంగా చేపట్టారు. ఒకట్రెండు రోజుల్లోనే ముద్రణ పూర్తి చేసి ఆ గ్రామాల ప్రజలకు అందజేస్తారు. బాధితులకు గులాబీ కార్డులు, గ్రామ ప్రజలకు తెల్ల కార్డులు జారీ చేస్తారు. 

రూ.లక్ష చొప్పున పరిహారం అందజేత 
కేజీహెచ్‌ నుంచి 287 మంది డిశ్చార్జ్‌
282 మందికి చెక్కుల పంపిణీ
ఎల్‌జీ ఘటన బాధితురాలికి బుధవారం లక్ష రూపాయల చెక్కుఅందిస్తున్న మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు 

స్టైరీన్‌ ప్రభావానికి గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల్లో పూర్తిగా కోలుకున్న 287 మందిని బుధవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. వారిలో 282 మందికి రూ.లక్ష చొప్పున పరిహారాన్ని మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు పంపిణీ చేశారు. అనంతరం వారిని ప్రత్యేక బస్సుల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.కోటి, వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షలు, మూడు రోజులు దాటి చికిత్స పొందే వారికి రూ.లక్ష, స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ.25 వేలు, ఐదు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించిన విషయం విదితమే. ప్రమాదానికి గురైన తమకు మెరుగైన వైద్యాన్ని అందించడంతో పాటు రూ.లక్ష పరిహారం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. కేజీహెచ్‌లో ఇంకా 13 మందికి వైద్యం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు