గత సర్కారు నిర్వాకం.. 29,616.29 కోట్ల భారం 

19 Jun, 2020 03:39 IST|Sakshi

ప్రాజెక్టుల్లో జాప్యంపై ఎండగట్టిన కాగ్‌ నివేదిక

2014–15 నుంచి 2017–18 వరకు రూ.43,031.61 కోట్ల వ్యయం

అయినా ఒక్క ప్రాజెక్టూ పూర్తికాని దుస్థితి

ఆలస్యంతో పనుల నాణ్యతపై ప్రతికూల ప్రభావం

రైతులకు అందని ఫలాలు

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గొడ్డలిపెట్టు

సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్‌ ప్రణాళికా రాహిత్యం, అవగాహన లేమి, చిత్తశుద్ధి లోపించడం సాగునీటి ప్రాజెక్టులకు శాపంగా పరిణమించిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక తేల్చి చెప్పింది. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ప్రాజెక్టులకు ఖర్చు చేయకపోవడంలో ఔచిత్యం ఏమిటని తప్పుబట్టింది. పనుల్లో తీవ్ర జాప్యం చేయడం వల్ల అంచనా వ్యయం భారీగా పెరిగి రాష్ట్ర ఖజానాపై రూ.29,616.29 కోట్ల మేర భారం పడిందని పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల వాటి ఫలాలు రైతులకు అందలేదని, ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని తీవ్రంగా దెబ్బ తీసిందని స్పష్టం చేసింది. బడ్జెట్‌లో కేటాయించిన మేరకు నిధులను ఖర్చు చేసి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని పేర్కొంది. 2017–18కి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసిన ‘కాగ్‌’ గత సర్కారు నిర్వాకాలను ఎండగడుతూ బుధవారం శాసనసభకు నివేదిక ఇచ్చింది.  

కాగ్‌ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ 
కాగితాల్లోనే కేపిటల్‌ వ్యయం... 
► రాష్ట్రంలో 2014–15 నుంచి 2017–18 వరకు బడ్జెట్‌లో కేపిటల్‌ వ్యయం కింద కేటాయించిన నిధులను ఖర్చు చేయడంలో టీడీపీ సర్కార్‌ ఘోరంగా విఫలమైంది. ఈ వ్యవధిలో గత సర్కార్‌ 27 సాగునీటి ప్రాజెక్టులపై రూ.43,031.61 కోట్లు ఖర్చు చేసినా ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది.  
► కేటాయించిన మేరకు వ్యయం చేసి ఉంటే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. పనుల్లో జాప్యం వల్ల ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.28,423.64 కోట్ల నుంచి రూ.58,039.93 కోట్లకు పెరిగింది. దీనివల్ల ఖజానాపై రూ.29,616.29 కోట్ల మేర భారం పడింది. 

రైతులకు అందని ఫలాలు..
► గత సర్కారు నాలుగేళ్లలో 27 సాగునీటి ప్రాజెక్టులకు రూ.43,031.61 కోట్లు ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. ఒక్క ఎకరాకూ కొత్తగా నీళ్లందించిన దాఖలాలు లేవు. అంటే ప్రాజెక్టుల ఫలాలు రైతులకు దక్కలేదన్నది స్పష్టమవుతోంది. 
► 2017–18లో చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలకు బడ్జెట్‌లో అదనంగా నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చేయలేదు.  చింతలపూడి ఎత్తిపోతలకు సంబంధించి రూ.311.60 కోట్లు, తాడిపూడి ఎత్తిపోతలకు సంబంధించి రూ.113.28 కోట్లను ఖర్చు చేయకపోవడంతో నిష్ఫలమయ్యాయి. దీంతో పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయారు. 
► సకాలంలో తాడిపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కాకపోవడం వల్ల రైతులకు వాటి ఫలాలు అందకపోకగా పనుల  అంచనా వ్యయం రూ.582.41 కోట్లకు పెరిగింది. 
► బడ్జెట్‌లో కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేసి ఉంటే అధిక శాతం ప్రాజెక్టులు పూర్తయ్యేవని, ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ఫలాలు అందేవని, తద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేదని కాగ్‌ తేల్చింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు