కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఒకేతాను ముక్కలు

30 Jul, 2014 02:06 IST|Sakshi
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఒకేతాను ముక్కలు

విజయనగరం టౌన్: కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఒకే తానులోని ముక్కలని,  వాటి జెండాలు వేరైనా, అజెండా మాత్రం ఒకటేనని  అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య  రాష్ట్ర కమిటీ సభ్యుడు రెడ్డి నారాయణరావు ఆరోపించారు.   పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలంటూ విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద  మంగళవారం  భారీ ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   కఠిన నిర్ణయాలు, సంస్కరణల పేరిట  సామ్రా జ్యవాదులకు దేశ బడా కార్పొరేటు కంపెనీల ప్రయోజనాలు కాపాడే విధానాలు అనుసరిస్తున్నారన్నారు.  ఎన్నికల వాగ్దానాలకు  తూట్లు పొడిచిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తూ సంక్షేమ పథకాలు కుదించడానికే ఆధార్ లింక్ పెట్టిందన్నారు.  
 
 ఈ విధానాలను  తిప్పికొట్టేందుకు పోరాటం చేయాలని  పిలుపునిచ్చారు.    అధికారం చేపట్టిన  నెలరోజులు దాటకుండానే రైలు చార్జీలు పెంచిందని, అక్కడితో  ప్రారంభించి ప్రతినెలా దొరికిన వస్తువులపై  వడ్డింపులకు సిద్ధపడుతోందన్నారు.  నిత్యావసర వస్తువుల ధరలు  ఆకాశాన్ని అంటుతుండగా అధిక ధరలను అదుపు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ చర్యలూ చేపట్టకుండా చోద్యం చూస్తున్నాయని ఆరోపించారు.   ఈ సందర్భంగా   ధర్నాలో  వివిధ ప్రజాసమస్యలపై  చిన్నారులు గౌతమి, దేవి, సతీష్ , కార్మిక సోదరులు  ఆలపించిన గేయాలు పలువురిని ఆకట్టుకునాయి. కార్యక్రమంలో  నాయకులు బి.శంకరరావు,  ఆటోయూనియన్ అధ్యక్షుడు ఎన్.అప్పలరాజు రెడ్డి, ఎం.పైడిరాజు, ఎం.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు