ఏపీలో పెట్టుబడులకు జర్మనీ సుముఖత 

10 Mar, 2020 05:56 IST|Sakshi
జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ కెరిన్‌కు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

త్వరలో ఇండో – జర్మన్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ 

సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీలో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ కెరిన్‌ స్టోల్‌ 

సౌర విద్యుత్, జీరో బడ్జెట్‌ ఫార్మింగ్, పర్యాటక రంగాల్లో కలిసి పనిచేస్తాం

నవరత్నాలు, సంక్షేమ పథకాలు బాగున్నాయని ప్రశంసలు  

సాక్షి, అమరావతి :  సౌర విద్యుత్, పర్యాటకం, జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌ వంటి రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ జర్మనీ ఆసక్తి వ్యక్తం చేసింది. జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ కెరిన్‌ స్టోల్‌ సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి.. కేవలం తొమ్మిది నెలల్లోనే నవరత్నాలు, పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆమె సీఎంను అభినందించారు. రాష్ట్రంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టే విధంగా త్వరలో ఇండో–జర్మన్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు, విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను సీఎం వివరించారు. కాగా, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలు.. పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారంటూ చెన్నైలోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ జర్మనీ ట్వీట్‌ చేసింది. ఇది ఇండో జర్మనీ సంబంధాల్లో గణనీయమైన సమావేశం అని పేర్కొంది. ఈ సమావేశంలో నాస్కామ్‌ మాజీ చైర్మన్, సెయింట్‌ (ఇన్ఫోటెక్‌) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక కార్యదర్శి పి.వి.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా కెరిన్‌ స్టోల్‌ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రాథమిక రంగాల్లో జర్మనీ దేశం తరఫున వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అంశంపై  చర్చించారు.   

ఏపీతో సన్నిహిత సంబంధాలు : కెరిన్‌ స్టోల్‌ 
- భారత్‌ – జర్మనీ మధ్య సన్నిహిత సంబంధాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతోనూ సత్సంబంధాలున్నాయి. 
- రాష్ట్రంలో జర్మనీకి చెందిన సీమెన్స్‌ – గమేసా, పలు విండ్‌ పవర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలున్నాయి. 
- ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఇండో జర్మన్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఆసక్తిగా ఉంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా దేశ కంపెనీలను ప్రోత్సహిస్తాం. 
- జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ ప్రమోట్‌ చేసే చర్యల్లో భాగంగా ది జర్మన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(కేఎఫ్‌డబ్ల్యూ) రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. 
- ఏపీ, జర్మన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించేందుకు, సాంస్కృతిక, పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తాం.  

రాష్ట్రంలో విప్లవాత్మక సంస్కరణలు : సీఎం జగన్‌ 
- రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కోసం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాం. 
- విద్య, వైద్యం, వ్యవసాయం మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. 
- కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు సంస్కరణలను చేపడుతోంది. 
- పాలిటెక్నిక్, బీటెక్‌లలో పాఠ్య ప్రణాళిక మార్పుతో పాటు కొత్తగా అప్రెంటిస్‌షిప్‌ విధానం తీసుకొచ్చాం. 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీతో పాటు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.  

మరిన్ని వార్తలు