‘ఉద్యోగాలను అమ్మేస్తున్నారు’∙

13 Jun, 2018 14:16 IST|Sakshi
కార్మికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజన్నదొర తదితరులు 

ఎమ్మెల్యే రాజన్నదొర

సాలూరు : కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను అధికార పార్టీ నాయకులు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర విమర్శించారు. మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో మున్సిపల్‌ కాంట్రాక్టు  కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మంగళవారం మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామన్నారని, అధికారం చేపట్టాక పలువురికి అన్యాయం చేశారన్నారు. ఇప్పుడేమో ఏకంగా కాంట్రాక్టు కార్మికులను కాంట్రాక్టర్‌కు అప్పగించాలని చూస్తుండడం దారుణమన్నారు.

డబ్బులు తీసుకోకుండా ఒక్కరికీ ఉద్యోగం కల్పించడంలేదన్నారు.  రానున్న ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వం రానుందని, అప్పుడు తప్పకుండా అర్హులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. జీఓ 279ను రద్దుచేయాలని చేస్తోన్న పోరాటాన్ని కార్మికులు ధైర్యంగా కొనసాగించాలని సూచించారు.

కార్మికులకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికులకు మద్దతు తెలిపినవారిలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ వంగపండు అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు సువ్వాడ రమణ, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ గిరి రఘు, మాజీ కౌన్సిలర్‌ రామకృష్ణ ఉన్నారు.

మరిన్ని వార్తలు