కృష్ణా జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం

12 Apr, 2020 16:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో మూడు రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. విజయవాడ నగరంలో రెడ్‌ జోన్లుగా ప్రకటించిన కుమ్మరిపాలెం, పాత రాజరాజేశ్వరి పేట, ఖుద్దూస్ నగర్, రాణిగారి తోట, పాయకాపురం, సనత్‌ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నారు. రెడ్‌జోన్లలో పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల వద్ద శానిటేషన్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ ప్రాంతమంతా సోడియం క్లోరైడ్‌ స్ప్రే చేస్తున్నారు. పది డ్రోన్లు, ప్రత్యేక ట్రాక్టర్ల వినియోగంతో అణువణువూ యాంటి కరోనా స్ప్రేలను ఉపయోగిస్తున్నారు. వీధుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ను ఫైర్‌ ఇంజిన్లతో స్ప్రే చేస్తున్నారు.
(భారత్‌లో 273కు పెరిగిన కరోనా మృతుల సంఖ్య)

రైతు బజార్‌కు వచ్చే వ్యక్తుల శరీరం మొత్తం యాంటి కరోనా స్ప్రే చేయడం కోసం ఎస్‌-3వీ టన్నెల్స్‌ను  ఏర్పాటు చేశారు. రద్దీ తగ్గించేందుకు మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేశారు. నగర పరిధిలో 15 పునరావాస కేంద్రాలను వీఎంసీ ఏర్పాటు చేసింది. శరణార్థులకు అన్ని సదుపాయాలతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. నగరంలో యాచకులను జల్లెడ పట్టి పునరావాసాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. మూడో విడత కుటుంబ సర్వేపై విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (వీఎంసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. కరోనా లక్షణాలతో పాటు, శ్వాస కోస వ్యాధులతో బాధపడేవారి వివరాలను సేకరిస్తున్నారు. ల్యాబ్‌లతో పనిలేకుండా శ్వాబ్‌ టెస్టులు నిర్వహించేలా బూత్‌లు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 20 కంటైన్‌మెంట్ క్లస్టర్‌లను గుర్తించారు. సీఎం వైఎస్‌ జగన్ ఆదేశాలతో సమన్వయంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. రోజురోజుకూ పరిస్థితి మెరుగుపడుతోంది.


 

మరిన్ని వార్తలు