16 ఏళ్లయినా ఆ రికార్డును కొట్టలేకపోయారు

12 Apr, 2020 16:46 IST|Sakshi

సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 12, 2004)లో టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. అప్పటివరకు టెస్టుల్లో డబుల్‌, ట్రిపుల్‌ సెంచరీలు సాధించడమే రికార్డుగా ఉండేది. కానీ ఒక్కడు మాత్రం ఎవరు ఊహించని రీతిలో క్వాడ్రపుల్‌ సెంచరీ(400* పరుగులు) నమోదు చేసి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. ఇప్పటికి ఆ రికార్డు సాధించి పదహారేళ్లు అవుతున్నా దాన్ని ఎవరు బద్దలు కొట్టలేకపోయారు. ఆ రికార్డును సాధించిన ఆటగాడెవరో ఈ పాటికే మీకు అర్థమయిందని అనుకుంటున్నాం. ఆ ఆటగాడు మరెవరో కాదు.. వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా. అంతకుముందు వరకు ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ గ్యారీ సోబర్స్‌ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును పదేళ్ల తర్వాత లారా 375 పరుగులతో అధిగమించాడు. అయితే లారా చేసిన 375 పరుగుల రికార్డును బ్రేక్‌ చేస్తూ ఆస్ట్రేలియా నుంచి మాథ్యూ హెడెన్‌ 2003లో జింబాబ్వేపై 380 పరుగులు చేసి టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. (ఆ చీకటి రోజుకు సరిగ్గా 20 ఏళ్లు)

అయితే ఏడాది తిరగకుండానే హెడెన్‌ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును లారా సవరించడమే గాక టెస్టుల్లో అనితరసాధ్యమైన (400 నాటౌట్‌)  సాధించాడు. లారా రికార్డును అందుకోవాలని చాలా మంది ఆటగాళ్లు ప్రయత్నించారు. ఇక భారత్‌ నుంచి రెండు ట్రిపుల్‌ సెంచరీలు సాధించిన విధ్వంసక ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ క్వాడ్రపుల్‌ సెంచరీని మాత్రం సాధించలేకపోయాడు. అప్పటినుంచి ఈ 400 పరుగుల రికార్డు అలాగే ఉండిపోయింది. అయితే ఈ ఇన్నింగ్స్‌కు 16 ఏళ్లు నిండడంతో మరోసారి ఆ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందాం.

2004 ఏప్రిల్‌లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించింది. నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి మూడు మ్యాచ్‌ల్లో లారా ఘోరంగా విఫలమయ్యాడు. 3 టెస్టుల్లో కలిపి కేవలం 100 పరుగులు చేయడంతో లారా ఫామ్‌పై అతని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సెయింట్‌ జాన్స్‌ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం క్రికెట్‌ చరిత్రలో ఎవరు అందుకోలేని 400 పరుగుల రికార్డును సాధించి తనపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు.  మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 582 బంతులు ఎదుర్కొన్న లారా ఏకంగా 43 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లారా భారీ ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 751/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకే ఆలౌటై.. ఫాలో ఆన్ ఆడినా ఓటమి నుంచి గట్టెక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 422/5 రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. (‘ఇమ్రాన్‌ కంటే భారత్‌ గురించే ఎక్కువ తెలుసు’)

లారా వ్యక్తిగత రికార్డు కోసం తొలి ఇన్నింగ్స్​ను మూడు రోజుల పాటు కొనసాగించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జట్టుకు విజయం అందించాలనేది పక్కనపెట్టి కేవలం తన రికార్డుల కోసం ఆరాటపడ్డాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విండీస్‌.. తమ సొంతగడ్డపై జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 0-3తో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. అయితే నాలుగోటెస్టులో మాత్రం లారా ఇన్నింగ్స్‌తో డ్రాగా ముగిసింది. లారా ఆటతీరుపై ఎన్ని వివాదాలు ఉన్నప్పటికి అతను చేసిన 400 పరుగుల రికార్డు 16 ఏళ్లయినా బద్దలు కాకపోవడమనేది ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే లారా రికార్డును ఎవరు బ్రేక్‌ చేస్తారనేది వేచి చూద్దాం.

మరిన్ని వార్తలు