ఎప్పుడు.. ఎలా.. ఎవరికి..

23 Jun, 2020 09:17 IST|Sakshi
పెద్దాపురం మేదరవీధిలో ట్రాఫిక్‌ మళ్లిస్తున్న ఎస్సై

చాపకింద నీరులా కరోనా వైరస్‌.. 

అప్రమత్తంగా ఉండకపోతే నష్టమేనంటున్న వైద్యాధికారులు

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా వైరస్‌ వ్యాపిస్తోంది. ఎక్కడ, ఎవరికి, ఎలా సోకుతుందో తెలియనంత దారుణంగా పరిస్థితులు మారాయి. జిల్లాలో పలుచోట్ల సోమవారం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పెద్దాపురం, కాజులూరు, రాయవరం మండలం చెల్లూరు, కాకినాడ సిటీ, రూరల్, రాజమహేంద్రవరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలం తదితర ప్రాంతాల్లో  పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ముఖ్యంగా జనసమూహం అధికంగా ఉండే ప్రాంతాల ద్వారానే కరోనా వ్యాపిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.  

సాక్షి, పెద్దాపురం: కరోనా మహమ్మారి పెద్దాపురం పట్టణాన్ని వణికిస్తోంది. ఈనెల 18న మాగంటి వారివీధికి చెందిన బ్యాంక్‌ ఉద్యోగికి పాజిటివ్‌ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అతడితో కలసిన మిరపకాలయ వీధి, మాగంటి వారి వీధికి చెందిన సుమారు 80 మందికి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా సోమవారం వారిలో ఏడుగురు బ్యాంకు ఉద్యోగి కుటుంబ సభ్యులకు, స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్తర్తిస్తున్న సామర్లకోటకు చెందిన మహిళకు, మేదరవీధికి చెందిన 26 ఏళ్ల యువకుడికి, పెద్దాపురం బొమ్మలగుడి వీధిలో ఇద్దరికి,  పద్మనాభ కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలుడికి పాజిటివ్‌గా నిర్ధారౖణెంది. దీంతో పట్టణంలో కరోనా కేసులు 18కు చేరాయి.  

ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ 
తుని: తునికి చెందిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిందని మున్సిపల్‌ కమిషనర్‌ బి.ప్రసాదరాజు సోమవారం తెలిపారు. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత డ్యూటీలో భాగంగా శ్రామిక రైలులో మహారాష్ట్ర వెళ్లి వచ్చాడన్నారు. కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో కాకినాడలో రక్తనమూనా సేకరించి పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ వచ్చిందన్నారు. తుని రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉండడంతో ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. తుని పట్టణంలో ఇది కరోనా పాజిటివ్‌ ఆరో కేసు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  చదవండి: ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసిన ఎస్సై

చెల్లూరులో 85కు చేరిన పాజిటివ్‌ కేసులు  
రాయవరం: మండలంలోని చెల్లూరు శివారు సూర్యారావుపేటలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈనెల రెండో తేదీన రెండు పాజిటివ్‌ కేసులు రాగా.. ఆ సంఖ్య సోమవారానికి 85కు చేరింది. ఇంకా 200 మందికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.  
 
జి.మామిడాడ టు సూర్యారావుపేట 
పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామం ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదైన ప్రాంతంగా ఉంది. జి.మామిడాడ తర్వాత అన్ని ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతంగా ప్రస్తుతం సూర్యారావు పేట నిలిచింది. గ్రీన్‌జోన్‌లో ఉన్న రాయవరం మండలం ఒక్కసారిగా రికార్డులకెక్కింది. సూర్యారావుపేటకు చెందిన కుటుంబం జి.మామిడాడలో జరిగిన వివాహ వేడుకలకు వెళ్లడంతో అక్కడి నుంచి కాంటాక్ట్‌ కేసులు ఇక్కడ పెరిగాయి. పలు కుటుంబాలు పాజిటివ్‌ కేసుల బారిన పడ్డాయి.  

పుల్లేటికుర్రులో మరో మూడు పాజిటివ్‌ కేసులు 
అంబాజీపేట: పుల్లేటికుర్రులో శివారు ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ముగ్గురికి సోమవారం పాజిటివ్‌ వచ్చినట్టు ముక్కామల వైద్యాధికారిణి కేవై దేవికుమారి తెలిపారు. ఈ నెల 20న భార్య, భర్తలకు పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. వీరితో పాటు వారి కుమారులిద్దరికి, కోడలికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. 
అల్లవరం: మండలం ఓడలరేవులో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

మిలటరీపేటలో మహిళకు పాజిటివ్‌ 
కాట్రేనికోన: కందికుప్ప పంచాయతీ మిలటరీపేటలో తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. మిలటరీపేటకు చెందిన 55 ఏళ్ల మహిళ గర్భకోశ వ్యాధితో బాధపడుతోంది. శస్త్ర చికిత్స కోసం ముమ్మిడివరంలో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా పాజిటివ్‌గా నిర్ధారణైంది.
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి బి.మాలకొండయ్య తెలిపారు.
కాకినాడ, రాజమహేంద్రవరం సిటీ : కాకినాడ సిటీ, రూరల్లో కూడా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  రాజమహేంద్రవంలో సోమవారం ఒక్క రోజే 22 కేసులు నమోదయ్యాయి.

కాజులూరులో మరో 29 కేసులు 
కాజులూరు: మండలంలో సోమవారం కొత్తగా మరో 29 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆర్యావటంలో గత బుధవారం తొలిసారిగా ఓ బాలింతకు కరోనా సోకింది. వైద్యాధికారులు ఆమెతో కాంటాక్ట్‌ అయిన వారిలో గత గురువారం 59 మందికి, శుక్రవారం 40 మందికి పరీక్షలు నిర్వహించారు. సోమవారం రిపోర్టు రాగా ఇందులో తొలిరోజు పరీక్షలు నిర్వహించిన 59 మందిలో  ఎనిమిది మందికి, అదే విధంగా శుక్రవారం నమూనాలు సేకరించిన 40 మందిలో 21 మందికి పాజిటివ్‌ వచ్చంది. దీంతో బాలింత మహిళతో కలసి ఆర్యావటంలో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరింది. కాగా పాజిటివ్‌ వచ్చిన వారిలో ఒకరు 60 ఏళ్ల వృద్ధురాలు ఉండగా మిగిలిన వారిలో అత్యధికులు ఎనిమిదేళ్ల నుంచి 15 ఏళ్ల వయసు గల చిన్నారులు ఉండడం ఆందోళనకలిగిస్తోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా