కార్పొరేషన్‌లో ఖాళీ కుర్చీలు

3 Sep, 2014 01:44 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : తమకు కేటాయించిన క్యాబిన్‌లో కనిపించని అధికారులు.. ఎప్పుడు వెళ్లినా ఖాళీగా కనిపించే కుర్చీలు.. ఇదేమని ప్రశ్నిస్తే ఆధార్ సీడింగ్ లేదా క్యాంపులు అంటూ సమాధానం. ఘనత వహించిన నెల్లూరు నగరపాలక కార్యాలయానికి వె ళ్లే ప్రజలకు నిత్యం ఎదురయ్యే  పరిస్థితి ఇది. అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ఎప్పుడు వెళ్లినా కార్పొరేషన్‌లో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు పగలంతా పడిగాపులు కాస్తూ సాయంత్రం పనులుకాక ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. అసలు అధికారులు కార్యాలయానికే రారనుకుంటే పొరపాటు. కీలక అధికారులంతా సాయంత్రమవగానే ఆఫీసుకు నింపాదిగా వస్తారు. అలాగని ప్రభుత్వ కార్యాలయాల ముగింపు సమయం 5.30 గంటల్లోగా వెళతారనుకుంటే పొరపాటే. రాత్రి 10 గంటలైనా సరే ఇంటిముఖం పట్టరు.
 
 అలాని చెప్పి ఆఫీసు కార్యకలాపాలు చక్కపెడతారనుకుంటే పొరబడినట్లే. అలాంటిదేమీ ఉండదు. కాంట్రాక్టర్లు, దళారులతో బిజీబిజీగా గడుపుతారు. తమ పనులు చక్కబెట్టుకునేందుకు సమయం వెచ్చిస్తారు. వీరి చీకటి దందా తెలిసిన ప్రజలు చేసేదేమీలేక వారు కూడా దళారుల సహకారంతో చీకటి పడ్డాకే కార్పొరేషన్ కార్యాలయానికి తరలివస్తున్నారు. దీంతో కార్పొరేషన్ కార్యాలయం పగటిపూట ఖాళీగా.. రాత్రిపూట  కళకళలాడుతూ కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు