'ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందే'

4 Aug, 2017 18:45 IST|Sakshi
'ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందే'

విజయవాడ: పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 21మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారని, అయితే వారితో ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించకపోగా నలుగురికి సీఎం చంద్రబాబునాయుడు మంత్రి పదవులు కూడా ఇచ్చారన్నారు. తెలంగాణలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పార్టీ ఫిరాయిస్తే చంద్రబాబు తీవ్రస్థాయిలో ఎండగట్టారని ఈ సందర్భంగా రామకృష్ణ గుర్తుచేశారు.

సాక్షాత్తూ సీఎం హోదాలో ఉన్నా చంద్రబాబు మాత్రం ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహించారని, అయితే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సంస్కృతికి భిన్నంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణిరెడ్డి చేత రాజీనామా చేయించి పార్టీలోకి చేర్చుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై వైఎస్సార్‌సీపీ నిర్ణయాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. పార్టీ ఫిరాయింపుదారులను రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సూచించారు. దీనివల్ల రాజకీయాలు భ్రష్టుపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. శిల్పాచక్రపాణిరెడ్డి నైతికతకు కట్టుబడి వ్యవహరించారని పేర్కొన్నారు. రాజకీయపక్షాలు ప్రజాస్వామిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని మధు హితవు పలికారు.