తెల్లకార్డులకు కత్తెర

4 Jul, 2015 01:47 IST|Sakshi
తెల్లకార్డులకు కత్తెర

ప్రస్తుతం 85 శాతం మందికే సరుకులు
ఆహార భద్రతా చట్టం ప్రకారం
67 శాతం మందికే అంటున్న కేంద్రం
మిగిలిన 18 శాతం మందికి ఎగనామం  
జిల్లాలో 3.2 లక్షల కార్డుల తొలగింపునకు సన్నాహాలు
దరఖాస్తు చేసుకున్నా కొత్త కార్డులు ఇక లేనట్టే
అయోమయంలో పేదలు

 
తెల్ల రేషన్‌కార్డులకు కోతపెట్టేందకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనలను సాకుగా చూపి కొత్తకార్డుల జారీకి మంగళం పాడేందుకు రెడీ అయిపోయింది. మరో సారి సర్వేల పేరుతో ఉన్నకార్డులను ఊడబెరికి పచ్చచొక్కాలోళ్లకు కట్టబెట్టేందుకు సమాయత్తమైంది.
 
చిత్తూరు:కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దారిద్య్రరేఖకు దిగువునున్న తెల్ల రేషన్‌కార్డుదారులైన పేదలకు శాపంగా మారింది. 67 శాతం మందికి  జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని వర్తింపచేస్తామని తాజాగా ప్రకటించింది. దీన్ని సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పెద్ద ఎత్తున తెల్లరేషన్‌కార్డుల తొలగించేందుకు సమాయ త్త మవుతోంది. ఇప్పటివరకు జిల్లా జనాభాలో        85 శాతం మందికి తెల్లరేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం తాజా గా ప్రకటించినట్లు 67  శాతం మందికి మాత్రమే ఆహార భద్రత చట్టం వర్తింపజేసే పక్షంలో మిగిలిన 18 శాతం మంది పేదలు ఆహారభద్రత కోల్పోతారు. వారికి నిత్యావసర సరుకులు అందే పరిస్థితి లేదు. ప్రస్తుతం జిల్లాలో 10,39,953 నివాస గృహాలు ఉండగా 41,74,064 వేల జనాభా ఉన్నారు. వీరిలో 9,80,888 కుటుంబాలకు తెల్లరేషన్‌కార్డులున్నాయి. 1,34,162 కుటుంబాలకు చక్కెర కార్డులున్నాయి. వీరుగాక మరో 1,17,524 మంది కొత్తగా తెల్లరేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో 1,06,811 మంది తెల్లరేషన్‌కార్డులకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. కానీ రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 67 శాతం మందికి మాత్రమే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సరుకులు పంపిణీ చేస్తామని తేల్చి చెప్పిన నేపథ్యంలో మిగిలిన 18 శాతం మందిని ఆహార భద్రతా చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ప్రస్తుతమున్న 9,80,888 తెల్లరేషన్‌కార్డుల్లో 6,57,195 (67 శాతం) తెల్లకార్డులను మాత్రమే ఉంచి, మిగిలిన 3,23,693 (18శాతం) తెల్లరేషన్‌కార్డులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. గుత్తమొత్తంగా అన్ని కార్డులను ఒకేసారి తొలగి స్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో మరోమారు బోగస్ కార్డుల ఏరివేత సాకుతో తెల్లకార్డులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తెల్లరేషన్‌కార్డుల పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడినట్లే. కార్డుల కోసం ఎదురుచూస్తున్న 1,17,524 మంది పేదలకు కార్డులు అందే అవకాశం లేనట్టేనని సమాచారం.
 
తెలుగు తమ్ముళ్లకే తెల్లకార్డులు
 కేంద్ర ఆహారభద్రతా చట్టం సాకుతో రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నాయకులు చెప్పి వారికి మినహా మిగిలిన వారి తెల్లకార్డులన్నింటినీ తొలగించేందుకు అధికార పార్టీ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే జన్మభూమి కమిటీల మాటున అర్హులైన పేదల కార్డులను ఏకపక్షంగా తొలగిస్తున్న అధికార పార్టీ నేతలు కేంద్రం తాజా ఉత్తర్వులను అనువుగా చేసుకు  పెద్ద ఎత్తున అర్హుల రేషన్‌కార్డులను తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రత్యేకించి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల తెల్లకార్డుల తొలగింపే ధ్యేయంగా తెలుగు దేశం నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
 

>
మరిన్ని వార్తలు