భారత్‌ను వణికిస్తున్న సైబర్‌ టెర్రర్‌

26 Dec, 2019 08:58 IST|Sakshi
దేశంలో 2015 నుంచి అధికారికంగా నమోదైన సైబర్‌ నేరాల గణాంకాలు ఇలా ఉన్నాయి.. 

సైబర్‌ దాడుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో మనదేశం

2019 అక్టోబర్‌ నాటికి 3.13 లక్షల సైబర్‌ నేరాలు

ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం నివేదిక

భారత అణుశక్తి కేంద్రం కూడా సైబర్‌ దాడికి గురికావడం ఆందోళనకరం 

సాక్షి, అమరావతి :  సమాచార, సాంకేతిక (ఐటీ) రంగంలో అగ్రపథంలో దూసుకుపోతున్న భారత్‌కు సైబర్‌ నేరాల బెడద అంతేస్థాయిలో బెంబేలెత్తిస్తోంది. 2016 నుంచి దేశంలో సైబర్‌ నేరాలు అమాంతంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సైబర్‌ నేరాల బాధిత దేశాల్లో మనదేశం రెండోస్థానంలో ఉంది. భారత అణుశక్తి సంస్థ ప్లాంట్లతోపాటు దేశంలో పలు కంపెనీలు సైబర్‌దాడులకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. 

భారీగా సైబర్‌ నేరాలు 
ప్రపంచంలో సైబర్‌ దాడులకు గురవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందని డాటా సెక్యూరిటీ కౌన్సిల్‌ (డీఎస్‌సీఐ) నివేదిక పేర్కొంది. అమెరికా మొదటి స్థానంలో ఉంది. అత్యధికంగా ఐటీ కంపెనీలు, బ్యాంకింగ్‌/ఆర్థిక సంస్థలతోపాటు పౌరుల వ్యక్తిగత డేటా కూడా తస్కరణకు గురవుతోందని నివేదికలో పేర్కొన్నారు. 2019, ఫిబ్రవరిలో లక్షలాది మంది ఆధార్‌ డేటా ఆధారంగా వారి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారని కూడా నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఆ సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల అక్రమాల కోసం ఓటర్ల వ్యక్తిగత డేటా దొంగిలించడం తీవ్ర చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. సైబర్‌ నేరాల కట్టడికి ఉద్దేశించిన కేంద్రానికి చెందిన ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (సీఈఆర్‌టీ–ఇన్‌) నివేదిక ప్రకారం.. ఈ ఒక్క ఏడాది అక్టోబర్‌కి దేశంలో 3.13 లక్షల సైబర్‌ నేరాలు జరిగాయి. ఈ నివేదికను ఇటీవల కేంద్రం పార్లమెంటుకు సమర్పించింది. 

సైబర్‌ దాడుల బాధితుల్లో అణుశక్తి సంస్థ కూడా! 
ఏ సంస్థ కూడా తాను సైబర్‌ దాడుల నుంచి సురక్షితంగా ఉన్నానని ధీమాగా ఉంటానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. తమిళనాడులోని భారత అణు ఇంధన సంస్థ (ఎన్‌పీసీఐఎల్‌)కు చెందిన కూడంకుళం అణు కేంద్రంలోని ఐటీ సిస్టమ్స్‌ కూడా సైబర్‌ దాడులకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సైబర్‌దాడి విషయం తెలియగానే భారత అణుశక్తి సంస్థ ఆ విషయాన్ని వెంటనే సీఈఆర్‌టీ–ఇన్‌కు తెలపడంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దేశంలో ఐటీ సేవలు అందించే సర్వీస్‌ ప్రొవైడర్లు, డేటా సెంటర్లు, కార్పొరేట్‌ సంస్థలు ఎక్కువగా సైబర్‌ దాడులకు గురవుతున్నాయి. మొత్తం సైబర్‌ దాడుల్లో 53 శాతం ఆర్థికపరమైన నష్టాలు కలిగిస్తున్నవే కావడం గమనార్హం. దేశంలో మెట్రో నగరాల కంటే ద్వితీయశ్రేణి నగరాల్లోని కంపెనీలు ఎక్కువగా సైబర్‌ దాడులకు గురవుతున్నాయని కే–7 కంప్యూటింగ్‌ సంస్థ తెలిపింది. ఈ జాబితాలో పూణే మొదటి స్థానంలో ఉండగా గువాహటి, లక్నో, భువనేశ్వర్, జైపూర్‌ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 2018 కంటే 2019లో సైబర్‌ దాడులు పూణేలో 10 శాతం, ఢిల్లీలో 6 శాతం, హైదరాబాద్‌లో 2 శాతం పెరిగాయి. 

సైబర్‌ ఇన్సూరెన్స్‌ బాటలో కంపెనీలు 
తమ కంప్యూటర్‌ వ్యవస్థలు సైబర్‌దాడి బారిన పడ్డాయని గుర్తించిన వెంటనే ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (సీఈఆర్‌టీ–ఇన్‌)’కు సమాచారమివ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. దేశంలో పలు కంపెనీలు సైబర్‌ దాడులకు గురైతే బీమా పరిహారం పొందేందుకు సైబర్‌ ఇన్సూరెన్స్‌ రక్షణ పొందేందుకు మొగ్గుచూపుతున్నాయి. 2018లోనే 350 కంపెనీలు సైబర్‌ ఇన్సూరెన్స్‌ చేయించుకున్నాయి. 2017 కంటే ఇవి 40 శాతం అధికమయ్యాయి. సైబర్‌ నేరాల కట్టడికి బ్రిటన్‌ తరహాలో కేంద్ర ప్రభుత్వం సమీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘సైబర్‌ నేరం జరిగితే సంబంధిత కంపెనీ మాత్రమే కాదు వినియోగదారులు కూడా నష్టపోతున్నారన్న విషయాన్ని గుర్తించాలి’ అని కే–7 కంప్యూటింగ్‌ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జె.కేశవవర్ధనన్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు