‘సైకిల్’ బోల్తా

12 Feb, 2014 03:14 IST|Sakshi

గత ఎన్నికల్లో పొత్తుల ఎత్తులతో పట్టు సాధించిన తెలుగు దేశం ఇప్పుడు చతికిలపడుతోంది. ఆ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి. అన్ని నియోజవర్గాల్లోనూ ఏదో సమస్య ఎదురై దాని ఉనికికే ప్రమాదం వచ్చి పడుతోంది. ‘రెండు కళ్ల’ సిద్ధాంతం మొత్తం భవిష్యత్తే లేకుండా చేస్తోంది. కొంతమంది నేతలు సురక్షిత స్థానాలకోసం వెతుకులాడుతుంటే కార్యకర్తలు డోలాయమానంలోపడుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :మహాకూటమితో పొత్తు కుదుర్చుకున్న తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో జిల్లాలో గరిష్ట లబ్ది పొందిం ది. 14 అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిది చోట్ల పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. తెలంగాణ అంశంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరితో పార్టీ ప్రతిష్ట క్రమేపీ మసకబారుతూ వచ్చింది.
 
 ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం, వలసలు, పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు పార్టీ పునాదులను దెబ్బతీశాయి. నాగం జనార్దన్‌రెడ్డి, పి.చంద్రశేఖర్ తదితర నేతలు ‘తెలంగాణ’ నేపథ్యంలో పార్టీని వీడారు.
 
 వీరి నేతృత్వంలో పనిచేసిన కింది స్థాయి నాయకుల మధ్య ఆధిపత్య పోరు తార స్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో కోటి ఆశలతో గెలిపించినా టీడీపీ ఎమ్మెల్యేలు జనం అంచనాలు అందుకోలేక పోయారు. మరో వైపు వచ్చే ఎన్నికల్లో కొందరు నేతలు ‘సురక్షిత స్థానాలను’ వెతుక్కునే పనిలో  ఉండటంతో పార్టీ కార్యకలాపాలు ఎక్కడా కనిపించడం లేదు.   దీంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా తయారైంది.
 
  జడ్చర్ల ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ సొంత సోదరుడి హత్య కేసులో నిందితుడిగా వున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం కొన్ని చోట్ల ఇతర పార్టీల్లోకి వలస వెళ్లింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పార్టీ మద్దతుదారులు విజయం సాధించలేకపోయారు.
 
  మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌గౌడ్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటే శ్ ఎవరికి వారుగా టికెట్‌ను ఆశిస్తున్నారు. 2012 ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారు.
 
  నారాయణపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి వరుసగా మూడు పర్యాయాలు గెలుపొందారు. వయో భారంతో  ఉన్న ఎల్లారెడ్డికి బదులుగా నవోదయ విద్యా సంస్థల చైర్మన్ ఎస్.రాజేందర్‌రెడ్డిని నియోజకవర్గ కన్వీనర్‌గా ప్రకటించారు. ఆయన సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నా, ఎల్లారెడ్డి వర్గీయుల మద్దతుపై స్పష్టత రావాల్సి వుంది.
 
  గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణమోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరడంతో టీడీపీకి నాయకుడు కరువయ్యాడు. 2013లో మాజీ మంత్రి డీకే సమరసింహా రెడ్డి టీడీపీ గూటికి చేరుకున్నా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పార్టీ డొల్లతనాన్ని రుజువు చేశాయి.
 
  వనపర్తి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి వున్నా తెలంగాణ అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరితో వ్యతిరేకత నెలకొంది.
 
 ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా  ఉన్న నాగర్‌కర్నూలులో ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి వుంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ నగారా సమితి ప్రారంభించారు. 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి జనార్దన్‌రెడ్డి తర్వాత టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అనుబంధ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెన్నయ్య, మాజీ సర్పంచ్ శరత్‌బాబు మనుగడ కోసం ప్రయత్నిస్తున్నారు.
 
   మక్తల్‌లో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ‘రెండు కళ్ల సిద్దాంతం’ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డికి ప్రతికూలంగా కనిపిస్తోంది.
 
 - పార్టీ ముఖ్య నేతలు జగదీశ్వర్‌రావు, హర్షవర్దన్ రెడ్డి పార్టీని వీడటంతో పగిడాల శ్రీనివాసులు టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మధుసూధన్‌రావు కూడా టికెట్ ఆశిస్తుండటంతో అంతర్గత పోరు ఆసక్తికరంగా తయారైంది.
 
   సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన సోదరుడు తిరుపతిరెడ్డిని స్థానికంగా పోటీ చేయించి, తాను రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.
 
  ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే సీత అడ్డుకున్నారనే ఆరోపణలు వున్నాయి. ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నేతలు టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లడం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపనుంది.
 
  సిట్టింగ్ ఎమ్మెల్యే పి.రాములు వచ్చే ఎన్నికల్లో నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం వినిపిస్తోంది. ఇదే జరిగితే పార్టీకి మరో అభ్యర్థి ఎవరనే అంశంపై స్పష్టత లేదు.
 
  2009 ఎన్నికల్లో ఆలంపూర్ రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్ తిరిగి నియోజకవర్గం ముఖం చూడలేదు. పార్టీ తాలూకా ఇంచార్జి ఆంజనేయులు మినహా పార్టీకి మరో ప్రత్యామ్నాయం ఇక్కడ కనిపించడం లేదు.
 
  సిట్టింగ్ ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్  ఉన్నా రెండు పర్యాయాలు కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలే గెలిపించాయనే ప్రచారం ఉంది. ద్వితీయ శ్రేణి కేడర్ పార్టీకి దూరం కావడంతో జైపాల్ వచ్చే ఎన్నికల్లో సాధించే ఫలితంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
 
  ఓ వైపు తెలంగాణ అంశంతో పార్టీ షాద్‌నగర్‌లో నిర్వీర్యం కాగా, మరోవైపు బీజేపీతో పొత్తు అంశం నేతలను కలవర పెడుతోంది. మాజీ ఎంపీపీ బెంది శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చెర్మైన్ వంకాయల నారాయణ రెడ్డి, మాజీ ఎంపిపి చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి,  అందెబాబయ్య, రఘునాథ్‌యాదవ్, కందివనం సూర్య ప్రకాశ్ టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు