పైత్యం దాటి పైశాచికం

25 Dec, 2023 03:50 IST|Sakshi

జనం మెచ్చిన జగన్‌ పాలనపై అసూయతో రగిలిపోతున్న రామోజీ

పరిపాలనకు మానవీయ కోణం.. జనంతో నిరంతరం జగన్‌ మమేకం 

నేను విన్నాను.. ఉన్నానంటూ ప్రతిపక్ష నేతగా నాడు ప్రజలకు భరోసా.. మాటకు కట్టుబడి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేడు పరిపాలన

సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో సీఎం జగన్‌

బాధితులు చెయ్యెత్తితే చాలు.. పిలిచి సమస్య పరిష్కరిస్తున్న సీఎం జగన్‌

అనారోగ్య బాధితులకు వెంటనే ఆర్థిక సాయం.. ఆపై ఉన్నత వైద్యం

అర్హతే ప్రామాణికంగా వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు

ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నికార్సైన జర్నలిజం!

ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేయడం రామోజీ రోత పాత్రికేయం!

నిత్యం పచ్చి అబద్ధాలతో ఆ పెత్తందారుడు అచ్చేస్తున్న కథనాలను చూస్తే.. గోబెల్స్‌ బతికి ఉంటే సిగ్గుతో తల వంచుకుని ఆత్మహత్య చేసుకునేవాడేమో!

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంపై రోజూ బురద జల్లుతూ టన్నుల కొద్దీ అబద్ధాలను తన విష పుత్రికలో రామోజీ అచ్చేస్తూ వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తప్పుడు కథనాల ఉద్ధృతిని పెంచారు. ఈ కోవలోనే ఆదివారం ‘ఈనాడు’లో ‘నేను ఉన్నాను.. నేను వినను’ శీర్షికతో తప్పుడు కథనాన్ని వండివార్చారు. ప్రతి అక్షరంలోనూ సీఎం వైఎస్‌ జగన్‌పై అక్కసును.. తన శిష్యుడు చంద్రబాబుపై అవ్యాజ్యమైన ప్రేమను మరోసారి ప్రదర్శించారు. 

అసూయకు మందే లేదు! 
ఆ అనారోగ్యానికి ఆరోగ్యశ్రీలో సైతం 
చికిత్స చేయడం కష్టమే మరి!!

ఇటు జనహితం.. అటు అధికార దర్పం
అందరినీ చిరునవ్వుతో పలుకరించడం.. సమస్యలను సావధానంగా వినడం.. చిత్తశుద్ధితో వాటిని పరిష్కరించడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వార­సత్వంగా వచ్చిందనడంలో ఎవరికీ సందేహం లేదు. ఎన్నోసార్లు ఈ విషయం రుజువైంది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించడం ఆయన నైజం. ప్రచార ఆర్భా­టాలకు దూరంగా పనులు పూర్తి కావాలని, ఆపన్నులకు సాయం అందాలని ఆశిస్తారు!

మరోవైపు అధికార దర్పం.. ప్రచార ఆర్భాటం.. ఎల్లో మీడియా తోడు లేనిదే పూట గడవని దుస్థితి చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరూ చూశారు! ఓ పాలకుడిగా ఆదుకోవాల్సిన యాసిడ్‌ దాడి బాధితురాలపై కక్షపూరితంగా సుప్రీంకోర్టుకెక్కిన అమానవనీయ చరిత్ర చంద్రబాబుదే! నాడు ఆయన నాయీ బ్రాహ్మణులను వేలెత్తి బెదిరించడం.. మత్స్యకారులను కించపరచిన ఘటనలు కళ్లముందే కదలాడుతున్నాయి!
 
నాడూ నేడూ అదే చిత్తశుద్ధి..
పరిపాలనకు మానవీయతను అద్ది సీఎం జగన్‌ జనరంజకంగా పాలిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ రాజీలేని పోరాటం చేశారు. సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాల్సిన శాసనసభను నాటి సీఎం చంద్రబాబు రాజకీయ కుట్రలకు కేంద్రంగా మార్చడాన్ని నిరసిస్తూ 2017 అక్టోబర్‌ 25న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి వైఎస్‌ జగన్‌ ప్రజల్లోకి వెళ్లారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా కల్పిస్తూ ‘ప్రజా సంకల్పం’ పాదయాత్రను 2017 నవంబర్‌ 6న ప్రారంభించారు.

ఇడుపులపాయ నుంచి ప్రారంభించి 3,648 కి.మీ. నడిచి 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగించారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి కష్టాలు విన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అంటూ భరోసా కల్పించారు. పాదయాత్ర హామీలనే మేనిఫెస్టోగా ప్రకటించి 2019 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. ఒక వ్యక్తిగా, ఒక ప్రభుత్వంగా ఎంతమందికి మేలు చేయగలమో అంతమందికి శక్తి వంచన లేకుండా మంచి చేయాలన్నది సీఎం జగన్‌ సంకల్పం.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని, గొంతు విప్పలేని వారికి అండగా నిలవాలంటూ దిశానిర్దేశం చేశారు. అదే స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నారు. ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలు చేశారు. అర్హతే ప్రామాణికంగా, వివక్షకు తావు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలను అందించారు. డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో ఇప్పటికే రూ.2.43 లక్షల కోట్లను జమ చేశారు. నాన్‌ డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. 

సొంత ఖర్చులతో ఎందరికో పునర్జన్మ..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం అనారోగ్య సమస్యలతో తన వద్దకు వచ్చిన ఎందరికో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత ఖర్చులతో వైద్యం అందించారు. అనేక మందికి శస్త్ర చికిత్సలు చేయించారు. నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు వారి కష్టాలను పెడచెవిన పెట్టింది కాబట్టే బాధితులు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆశ్రయించారు. వారి సమస్యలు విన్న వైఎస్‌ జగన్‌ సొంత ఖర్చులతో వైద్యం, శస్త్రచికిత్సలు చేయించి బాధితుల కన్నీళ్లు తుడిచారు. అధికారంలోకి వచ్చాక అనునిత్యం ప్రజా సమస్యలతోపాటు రంగాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు.

ఏ కార్యక్రమంలో పాల్గొన్నా దారి పొడవునా ఎంతోమంది ప్రజలను కలుసుకుని విధి వంచితులు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారి పట్ల అత్యంత మానవీయ దృక్పథంతో స్పందిస్తూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. సీఎం జగన్‌  అభయం ఇచ్చిన గంటల వ్యవధిలోనే బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు చెక్కులను పంపిణీ చేస్తున్నారు. అక్కడితో ఆగిపోకుండా వారి సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేలా సంపూర్ణంగా చేయూత అందిస్తున్నారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికైతే చికిత్సలు, సర్జరీలు చేయించడం దగ్గర నుంచి జబ్బు నయం అయ్యే వరకూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ హయాంలో ఇలాంటి సహాయం అందిన దాఖలాలు లేవు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన వినతిపత్రాలను సైతం చంద్రబాబు గాలికొదిలేశారు. 

సమస్యల పరిష్కారంలో దిక్సూచి..
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పాలకులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిక్సూచిలా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ 25,26,936 సమస్యల పరిష్కారం కోసం ప్రజలు దరఖాస్తు చేసుకోగా 25,21,050 సమస్యలను అధికారులు పరిష్కరించారు. మిగతా 5,886 సమస్యలను సైతం పరిష్కరించడంలో నిమగ్నమయ్యారు. సమస్యపై ప్రజల నుంచి ఫిర్యాదు అందిన దగ్గర నుంచి పరిష్కారం అయ్యేవరకూ అర్జీదారులకు అది ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు తెలియచేసే వ్యవస్థను తీసుకొచ్చారు.

స్పందన కార్యక్రమానికి మరిన్ని మెరుగులు దిద్దిన ప్రభుత్వం ‘జగనన్నకు చెబుదాం’ ద్వారా మరింత సమర్థంగా ఫిర్యాదులను పరిష్కరిస్తోంది. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ 3,53,774 ఫిర్యాదులు అందగా 3,24,876 సమస్యలను పరిష్కరించారు. మరో 28,898 సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.  ఇలాంటి కార్యక్రమాలను చేపట్టేందుకు గత ప్రభుత్వాలు సాహసించని పరిస్థితి. సమస్యలు పరిష్కారం కాకపోతే  రాజకీయంగా దెబ్బ తింటామనే భయంతో ఇలాంటి కార్యక్రమాలకు చంద్రబాబు దూరంగా ఉన్నారు. ప్రజా వినతుల పరిష్కారాన్ని ఒక లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై విషం చిమ్మడం ఏ తరహా పాత్రికేయం రామోజీ?

చేయి ఎత్తి పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికీ..
జిల్లాల పర్యటనల్లోనే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భాల్లో కూడా సీఎం జగన్‌ ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తూ వాటి పరిష్కార బాధ్యతను తన కార్యదర్శికి అప్పగిస్తున్నారు. ప్రతి రోజూ వాటిపై సమీక్షిస్తున్నారు. తన కాన్వాయ్‌ వెళ్తున్న సమయంలో ఎవరైనా చేయి ఎత్తితే చాలు.. సీఎం జగన్‌ ఆగి మరీ వారి వద్దకు వెళ్లి సమస్య గురించి ఆరా తీసిన సందర్భాలు కోకొల్లలు. 

వికేంద్రీకరణతో గుమ్మం వద్దకే సేవలు..
సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే వికేంద్రీకరణతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలను 2019 అక్టోబర్‌ 2న ప్రారంభించగా 2020 జనవరి 26 నుంచి పూర్తి స్థాయిలో సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ఇప్పటివరకూ 9.72 కోట్ల సేవలను ప్రజలకు అందించారు. సెలవు రోజులు మినహాయిస్తే రోజుకు సగటున 75 వేలకుపైగా సేవలను అందించడం గమనార్హం.

సంతృప్త స్థాయిలో పెన్షన్లు..
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చినా అర్హులందరికీ పూర్తి స్థాయిలో పథకాలు అందేవి కావు. పెన్షన్‌ తీసుకుంటున్న వారు ఎవరైనా చనిపోతేనే వారి స్థానంలో కొత్తగా పెన్షన్‌ మంజూరు చేస్తామని తేల్చి చెప్పిన అమానవీయ పాలన చంద్రబాబుది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక పెన్షన్లు కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే అర్హులకు మంజూరు చేస్తున్నారు. రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే అందిస్తున్నారు. ఇంటి దరఖాస్తుదారులకు 90 రోజుల్లోనే స్థలం పట్టా ఇవ్వడంతోపాటు ఇల్లు కట్టుకోవడానికి నిధులను మంజూరు చేస్తున్నారు.

అమానవీయ పాలనకు చిరునామా చంద్రబాబు..:
► యాసిడ్‌ దాడిలో గాయపడ్డ మహిళ అనూరాధ ఆర్థిక సాయం కోసం ప్రభుత్వాన్ని అర్ధిస్తే చంద్రబాబు పాలనలో పట్టించుకోలేదు. అనూరాధకు సాయం చేయాలని హైకోర్టు తీర్పు ఇస్తే దాన్ని çసవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన మనస్తత్వం చంద్రబాబుది.

► తమ జీతాలు పెంచాలంటూ నాయీ బ్రాహ్మణులు సచివాలయానికి వచ్చి వేడుకుంటే తోకలు కత్తిరిస్తానంటూ అహంకారంతో బెదిరించిన నైజం చంద్రబాబుది. 

► 2014 ఎన్నికల హామీ మేరకు తమకు ఎస్టీ రిజర్వేషన్‌ కల్పించాలని కోరిన మత్స్యకారులను తాట తీస్తానంటూ హూంకరించిన అమానవీయ పాలకుడు చంద్రబాబు. 
► హామీలను అమలు చేయాలని అభ్యర్థించిన ముస్లిం మైనార్టీ యువకులపై దేశద్రోహం కేసులు బనాయించి జైళ్లలో పెట్టించిన ఘనత కూడా చంద్రబాబుదే. 

► చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్లిన సమయాల్లో ఒక్క అభ్యాగ్యుడినైనా కలసి సహాయం చేసిన దాఖలాలు మచ్చుకైనా లేవు. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడిన సందర్భాలు లేవు.

► పుష్కరాల్లో తన ప్రచార పిచ్చితో 27 మంది మరణిస్తే కనీసం వారి కుటుంబాలను పరామర్శించని అనైతిక ధోరణి చంద్రబాబుది. వారికి పరిహారం ఇప్పించడానికి స్థానిక ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సి వచ్చింది.

► టీడీపీ హయాంలో తమ విజ్ఞాపనలు తీసుకోవడం లేదని కరకట్టలోని చంద్రబాబు నివాసం వద్ద ఒక మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించారు. సచివాలయం వద్ద కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.

► చంద్రబాబు సీఎంగా ఉండగా కార్యాలయంలో ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన కార్యదర్శి సతీష్‌ చంద్ర తలుపును నాటి మంత్రి అయ్యన్న పాత్రుడు తన్నుకుంటూ వెళ్లారు. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ సైతం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని నాటి సీఎం కార్యాలయ అధికారులపై నిరసన వ్యక్తం చేశారు. 

► అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏ రోజూ వినతి పత్రాలు స్వీకరించలేదు. ఫొటోషూట్‌ కోసం అప్పుడప్పుడు ఒకటి రెండు వినతిపత్రాలు తీసుకున్నా బుట్టదాఖలు చేసేవారు. సుదీర్ఘ సమీక్షలతో కాలం గడిపేవారు. 

► రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి పరిహారం ఇవ్వాల్సి వస్తుందని కుటుంబ సమస్యలు, మద్యం తాగి మరణించారంటూ తప్పించుకుని అమానవీయంగా ప్రవర్తించిన చంద్రబాబును రామోజీరావు భుజనికెత్తుకుని కీర్తిస్తున్నారు.

మళ్లీ పరాజయం తప్పదనే
రాష్ట్రంలో 55 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోంది. చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ జత కట్టినా ఆ జోడీకి ప్రజా స్పందన లభించడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయమని టైమ్స్‌ నౌ సహా పలు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడవడంతో రామోజీ ఆందోళన చెందుతున్నారు.

2019 ఎన్నికలకు మించి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని, ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని గ్రహించారు. చంద్రబాబుతో కలిసి ప్రజాధనం దోపిడీకి సహకరించిన రామోజీ టీడీపీ ఉనికిని కాపాడటం కోసం సీఎం జగన్‌పై బురద జల్లుతూ తప్పుడు కథనాలను అచ్చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారు.   

>
మరిన్ని వార్తలు