మరింతగా బలహీనపడిన ‘పెథాయ్‌’

18 Dec, 2018 15:40 IST|Sakshi

సాక్షి, అమరావతి : మూడు రోజులుగా హడలెత్తించిన పెథాయ్‌ తుపాను ఎట్టకేలకు నిష్క్రమించనుంది. వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారి ఒడిశా తీర సమీపంలో కేంద్రీకృతం కానుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఉత్తరాంధ్రలో ఈరోజు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తాలోని అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు ఎత్తివేసిన అధికారులు... ఈరోజు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.
 
22 మంది మత్స్యకారుల ఆచూకీ గల్లంతు
కాకినాడ : పెథాయ్ తుపాన్ సృష్టించిన అలజడి కారణంగా 22 మంది మత్స్యకారుల జాడ తెలీకుండా పోయింది. తుపాన్ గాలుల ధాటికి ఆయిల్ రిగ్గుకు కట్టుకున్న తాడు తెగి వీరు ప్రయాణిస్తున్న బోటు మచిలీపట్నం వరకు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో వేటకు వెళ్లిన దుమ్ములపేట, పర్లోవపేట, ఉప్పలంకకు చెందిన మత్స్యకారులు ఆచూకీ తెలీకుండా పోయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం దుమ్ములపేటకు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం తీరానికి చేరుకున్న వీరు బంధువులకు సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇక పర్లోవపేట, ఉప్పలంకకు చెందిన 22 మంది మత్స్యకారుల గురించిన సమాచారం తెలియాల్సి ఉంది. వీరి జాడ కోసం నేవీ, కోస్టు గార్డులు గాలింపు చర్యలు చేపట్టారు.

రైతులకు కన్నీళ్లే
తుపాను ధాటికి పిఠాపురం నియోజకవర్గంలోని దుర్గాడ, చేబ్రోలు, విజయనగరం, మల్లవరంలో తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. వరి, ఉద్యానవన పంటలు నీట మునగడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉల్లి, మిర్చి, పత్తి, మినప పంటలకు భారీగా పెట్టుబడి పెట్టామని, ఇంత నష్టం జరిగినా అధికారులు తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయనగరం జిల్లాలో పెథాయ్ తుపాన్ నష్టం..
పెథాయ్‌ ప్రభావంతో గరివిడి మండలం కుమరాం గ్రామంలో చలికి 50 గొర్రెలు మృతి చెందాయి. వెదుర్లవలస గ్రామంలో వర్షం కారణంగా పాఠశాల ప్రహారీ గోడ కూలిపోయింది. కురపాం మండలంలో చలికి, వర్షానికి మొత్తం 26 ఆవులు మృత్యువాత పడ్డాయి.
 

మరిన్ని వార్తలు