‘మోదీ స్ధానంలో గడ్కరీ’

18 Dec, 2018 15:38 IST|Sakshi
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, ముంబై : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలంటే ప్రధాని నరేంద్ర మోదీని తప్పించి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లాలని మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ రైతు నేత వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ మంగళవారం పర్యటిస్తున్న క్రమంలో రైతు నేత, వసంత్‌రావు నాయక్‌ సేఠి స్వావలంబన్‌ మిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ తివారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి మోదీ అహంభావ ధోరణే కారణమని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రో ధరల పెంపు వంటి ప్రజా వ్యతిరేక చర్యలతోనే ఓటమి ఎదురైందని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ సురేష్‌ జోషిలకు రాసిన లేఖలో తివారీ పేర్కొన్నారు. పార్టీలో అతివాద, నిరంకుశ ధోరణితో వ్యవహరించే నేతలతో సమాజానికి, దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చేందుకు పార్టీ పగ్గాలను నితిన్‌ గడ్కరీకి అప్పగించాలని కోరారు. ఇటీవలీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణమైన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాలను బీజేపీ వదిలించుకోవాలని తివారీ ఇటీవల వ్యాఖ్యానించి కలకలం రేపారు.

మరిన్ని వార్తలు