సాహసం చేయాలి మరి!

16 Jul, 2016 10:51 IST|Sakshi

 సీతానగరం: మండలంలోని వివి ధ గ్రామాలకు చెందిన దాదా పు 850 మంది పిల్లలు రోజూ సమీప పట్టణాల్లో చదువుకోసం వెళ్తుంటారు. అయితే వీరు ప్రయాణించాల్సిన సమయాల్లో ఒకటి, అరా బస్సులు మాత్రమే ఉండటంతో వారంతా బస్సు ల్లో కిక్కిరిసి ప్రయాణించడమేగాదు... ఏకంగా బస్ టాప్‌పైకి ఎక్కి వెళ్లాల్సి వస్తోంది. ఇది ఈ ప్రాంత విద్యార్థులకు రోజువారి దినచర్యగా మారిపోయింది. ఇది ప్రమాదమని తెలిసినా అధికారులు వారికి అదనపు బస్సులు సమకూర్చేందుకు ముందుకు రావడం లేదు.
 
 దాదాపు అన్ని గ్రామాలనుంచీ అదే పరిస్థితి
 మక్కువ రూట్‌నుంచి సీతానగరం, బొబ్బిలి, పార్వతీపురం వంటి ప్రాంతాలకు దాదాపు 400మంది, పి.చాకరాపల్లి, అజ్జాడ తదితర గ్రామాల నుంచి 450 మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. సకాలంలో విద్యాలయాలకు చేరాలంటే... వచ్చే ఒక్కబస్సునే ఇంతమందీ ఆశ్రయించాల్సి వస్తోంది. మక్కువ నుంచి, పి.చారాపల్లినుంచి ఉదయం పూట 8 గంటల సమయంలో వచ్చే బస్సులు చాలక పోవడంతో కొయ్యానపేట, బగ్గం దొరవలస, బళ్ళకృష్ణాపురం నుంచి విద్యార్థులు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టాప్‌పైనే ప్రయాణం చేయాల్సి వస్తోందని చెబుతున్నారు.
 
 అలాగే పి.చాకరాపల్లి బస్సులో బూర్జ, పెదంకలాం, కృష్ణరాయపురం, చెల్లంనాయుడువలస, లక్షీపురం గ్రామాల విద్యార్థులు బస్సు టాప్‌పైనే రోజూ ప్రయాణం చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇలా ఉదయం, సాయంత్రం ప్రయాణిస్తుండటంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం స్టూడెంట్స్ బస్సును ఉదయం-సాయంత్రం పూట బస్సు తిరుగాడేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  
 
 కాలేజీకి వెళ్లాలంటేనే భయమేస్తోంది
 నేను తామరఖండి నుంచి సీతానగరం ప్రభుత్వ జూనియర్ కాలేజీకి 9గంటలకు వెళ్లాలి. తామరకండిలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి రోడ్డుకు వస్తున్నాను. బస్సులు ఆపక పోవడంతో చివరిక్షణంలో సైకిలుపై వెళ్ళాల్సి వస్తోంది. తక్షణమే అదనంగా బస్సు వేయ్యాలి.
  సురాపాటి లావణ్య, విద్యార్థిని
 
 పెదంకలాంలో బస్సులు ఆపట్లేదు
 రోజూ వందలాదిమంది ప్రయాణించే అజ్జాడ రూటులో బస్సులు చాలక టాప్‌పైనే కాలేజీకి వస్తున్నాను. అదనంగా బస్సువెయ్యాలని కోరినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఒక్కోసారి పెదంకలాంలో ఆ బస్సుకూడా ఆపట్లేదు.
 - అలజంగి సాయి, ఇంటర్‌విద్యార్థి, పెదంకలాం.
 

మరిన్ని వార్తలు