Types of Earthquake: ఏ రకమైన భూకంపం అత్యంత ప్రమాదకరం?

4 Nov, 2023 09:33 IST|Sakshi

మీకు తెలుసా? భూమిపై వేర్వేరు చోట్ల రోజూ కనీసం 55 భూకంపాలు సంభవిస్తూంటాయని! ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవమే. భూమి పొరల్లో నిత్యం జరిగే కదలికలు ఒక దశ దాటినప్పుడు పుట్టే భూకంపం విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణమవుతోంది. నేపాల్‌ శనివారం తెల్లవారుజామున 6.4 తీవ్రతతో ఏర్పడ్డ భూకంపం కూడా వందల మందిని బలితీసుకుంది. ఈ నేపధ్యంలో భూకంపం అంటే ఏమిటి? ఇవి ఎన్ని రకాలు?  ఆసక్తికరమైన ఈ వివరాలు మీ కోసం...

మన భూమి మొత్తం మూడు పొరలుగా ఉంటుందని..పై భాగాన్ని క్రస్ట్‌, రెండో పొరను మాంటెల్‌.. మధ్యభాగంలోని భాగాన్ని కోర్‌ అంటారని భౌగోళిక శాస్త్రం చెబుతుంది. క్రస్ట్‌ భాగానికి వస్తే.. ఇది జిగ్‌సా పజిల్‌ మాదిరిగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఈ ముక్కలనే మనం టెక్టానిక్‌ ప్లేట్లు అంటాం. పైగా ఈ ముక్కలు చాలా నెమ్మదిగా కదులుతూంటాయి కూడా. ఈ కదలికల కారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ టెక్టానిక్‌ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొంటూంటాయి. కొన్నిసార్లు ఒక ప్లే ఇంకోదాని కిందకు జరిగిపోతూంటాయి. ఈ క్రమంలో అక్కడ పేరుకుపోయిన ఒత్తిడి అకస్మాత్తుగా విడుదలైతే దాన్ని మనం భూకంపం అని పిలుస్తాం. స్థూలంగా ఈ భూకంపాలు నాలుగు రకాలు... 

భూమి పైపొరలు కదిలితే...

భూమి పైపొర క్రస్ట్‌లోని టెక్టానిక్‌ ప్లేట్ల ఒరిపిడి కారణంగా వచ్చేవి ఇవి.  ఈ  పలకలు కదిలే సమయంలో కొన్నిసార్లు ఒకదానికిందకు ఒకటి వెళ్లిపోతాయి. లేదా దూరంగా జరుగుతాయి. ఇంకొన్నిసార్లు దగ్గరకు వస్తూంటాయి.  ప్లేట్లు వేగంగా కదిలినప్పుడు ఒకదానితో ఒకటి ఢీకొని ప్రెషర్‌ విడుదలవుతుంది. అంటే భూకంపం వస్తుందన్నమాట. వీటిని టెక్టానిక్‌ భూకంపాలని పిలుస్తారు. భూకంపాలు చాలా వరకు ఈ రకమైనే. సాధారణ భూకంపాలు అని కూడా అంటారు. టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ఎక్కువ వేగం ఉంటే వచ్చే భూకంపం క్షణాల్లో ఎంతటి నగరాన్నయినా ధ్వంసం చేస్తుంది. జనావాసాలు లేని, సముద్రాల్లో వచ్చే భూకంపాలతో నష్టం తక్కువ. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న చోట్ల వస్తే మాత్రం ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. 

అగ్నిపర్వత ప్రాంతాల్లో ఒత్తిడి తీవ్రమైతే... 

అగ్నిపర్వతాలకూ టెక్టానిక్‌ ప్లేట్లకూ మధ్య కొంత సంబంధం ఉంది. టెక్టానిక్‌ ప్లేట్ల సరిహద్దుల వద్ద అంటే రెండు ప్లేట్లు కలుసుకునే చోట భూమి లోపలి పొరల్లో ఉండే లావా వంటి పదార్థం బయటకు వచ్చే మార్గాలీ అగ్ని పర్వతాలు. భూమ్మీద ఉన్న అత్యధిక శాతం అగ్ని పర్వతాలు ప్లేట్ల సరిహద్దుల్లోనే ఉన్నాయి. టెక్టానిక్‌ ప్లేట్లు కదులుతూ ఉంటాయని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా... ఆ కదలికల కారణంగా అగ్నిపర్వతాల దిగువన కూడా ఒత్తిడి, రాపిడి పెరిగిపోతుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు భూమి పై పొర (క్రస్ట్‌) చిరిగిపోయి లోపలి లావా, కరిగిన రాయి పైకి ఎగజిమ్ముతుంది. దాన్నే మనం అగ్నిపర్వత భూకంపం అని పిలుస్తాం. 18వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు భూకంపాలకు అగ్నిపర్వతాలు ప్రధాన కారణమని అనుకునేవారు.  కానీ ఇది సరికాదని నిరూపించడానికి, శాస్త్రవేత్తలు ప్రయత్నించి అసలు విషయం తెలుసుకున్నారు. అగ్నిపర్వతం పేలినప్పుడు భూమి లోపలి భాగంలో శూన్యత ఏర్పడుతుందని, ఈ శూన్యతను పూరించడానికి, అంతర్గత శిలలు లోనికి జారుతాయని తెలిపారు. అప్పుడు భూకంపం ఏర్పడుతుందని తేల్చారు.

అయితే సాంకేతిక అభివృద్ధి ఈ భావన నిరాధారమని నిరూపించింది. హిమాలయ ప్రాంతంలో గత వందేళ్లలో అగ్నిపర్వత విస్ఫోటన సంకేతాలు లేనప్పటికీ ఈ ప్రాంతంలో భూకంపాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇది అగ్ని పర్వతాల కారణంగా భూకంపాలు సంభవిస్తాయనే వాదనను తోసిపుచ్చింది. అయితే అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సంభవించే భూకంప ప్రభావిత ప్రాంతం చాలా పరిమితంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు గమనించారు.

కుప్పకూలినా... భూకంపమే!

భూమిలోపలి నిర్మాణాలు (గుహలు, గనులు సొరంగాలు) కుప్పకూలినప్పుడు పుట్టే భూకంపాలు ఇవి. వీటి తీవ్రత తక్కువే. ప్రభావం కూడా తక్కువ ప్రాంతంలో కనిపిస్తుంది. కొలాప్స్‌ భూకంపాలు చాలా వరకూ మానవ చర్యల ఫలితంగానే వస్తూంటాయి.  2010లో కోపియాపో గనుల వద్ద, 2019లో రిడ్జ్‌క్రెస్ట్‌ (కాలిఫోర్నియా, అమెరికా) ఇలాంటి భూకంపాలు నమోదయ్యాయి. అణ్వస్త్ర, రసాయన ఆయుధాల పేలుళ్లు కూడా భూకంపాలకు కారణమవుతాయి.  భారీ స్థాయి గని పేలుళ్లు కూడా! వీటిని పేలుళ్లకు సంబంధించిన భూకంపాలు ఇంగ్లీషులో చెప్పాలంటే ఎక్స్‌ప్లోషన్‌ ఎర్త్‌క్వేక్స్‌ అని పిలుస్తారు. వీటితో విధ్వంసం తక్కువ. కాకపోతే ప్రకపంపలు చాలా దూరం ప్రయాణించగలవు. 1945లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై అణుబాంబు పడినప్పుడు, లెబనాన్‌లో 2020లో జరిగిన పేలుడు ఓ మోస్తరు స్థాయిలో భూకంపాలు పుట్టించాయి. 

ఇది కూడా చదవండి: నేపాల్‌లో భారీ భూకంపం.. 128 మంది మృతి

మరిన్ని వార్తలు