ఇక పోస్టాఫీసుల్లోనూ డెబిట్ కార్డు వాడొచ్చు

2 Feb, 2015 01:55 IST|Sakshi

గుడ్లవల్లేరు: బ్యాంకింగ్ వ్యవస్థ లేని గ్రామాల్లో సైతం డెబిట్ కార్డుల ద్వారా పోస్టాఫీసుల్లో నగదు లావాదేవీలు సాగించేందుకు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్ తెలిపారు. ఇది ఏపీ, తెలంగాణలోని 108 పోస్టాఫీసుల్లో ఈ నెల 9 నుంచి అమల్లోకొస్తుందని తెలిపారు. ప్రజావసరాలను తీర్చేందుకు పోస్టాఫీసులు నిరంతర సేవలందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పోస్టాఫీసుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

రెండు రాష్ట్రాల్లోనూ నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత ఉందని, వాటిని పోస్టాఫీసుల్లో అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. వరల్డ్ నెట్ ఎక్స్‌ప్రెస్ పథకం ద్వారా ప్రపంచంలోని 188 దేశాలకు పార్సిళ్లు, డాక్యుమెంట్లను నాలుగు రోజుల్లో పంపవచ్చని తెలిపారు. తమ శాఖ రూ.35 కోట్లతో ఎనిమిది కొత్త భవనాల్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అందులో మచిలీపట్నంలో కూడా ఒకటుందని చెప్పారు.

మరిన్ని వార్తలు