పాతనోట్లతో వెంకన్నకే శఠగోపం!

11 Jan, 2017 20:41 IST|Sakshi
పాతనోట్లతో వెంకన్నకే శఠగోపం!
గత ఏడాది నవంబర్ 8న కేంద్రం నోట్లను రద్దుచేసిన తర్వాత దేవాలయాల హుండీల్లో భక్తులు భారీగా పాత పెద్ద నోట్లను కానుకల రూపంలో వేశారు. రద్దయిన నోట్ల మార్పిడి గడువు (డిసెంబర్30)తో ముగిపోయినా... దేవాలయాల హుండీల్లో మాత్రం పాత నోట్లను భక్తులు ఇంకా వేస్తూనే ఉన్నారు. ఏవో చిన్నా చితకా ఆలయాలు కావు.. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకన్నకూ ఈ పాతనోట్ల బెడద తప్పడం లేదు. జనవరి 1 నుంచి 11 వరకు ఇలాంటి పాతనోట్లు ఏకంగా రూ. 1.70 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం హుండీల్లో జమ అయ్యాయని టీటీడీ వర్గాలు తెలిపాయి. అత్యధికంగా డిసెంబర్ 31న రద్దయిన నోట్లు రూ.44 లక్షలు వచ్చాయి. అంతేకాదు న్యూఇయర్ రోజున కూడా 31 లక్షలు వచ్చాయి. ఆ నగదును వెంటనే బ్యాంకుల్లోను, పోస్టాఫీసుల్లోను జమచేశామని ఆలయ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 
 
డిసెంబర్ 30 తర్వాత కూడా భక్తులు ఇంకా రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను హుండీల్లో వేస్తూనే ఉన్నారు. ఏడాదికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే 2.60 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అధికారి తెలిపారు. రోజుకు సగటున రూ. 2.80 కోట్ల ఆదాయం వస్తుందని, గత ఏడాది హుండీ ఆదాయం రూ.1000 కోట్లకు పైగా వచ్చిందని ఆలయ అధికారి తెలిపారు. ఈ కానుకలు బంగారు ఆభరణాలు, డబ్బుల రూపంలో వస్తాయని ఆయన వెల్లడించారు.
 
మరిన్ని వార్తలు