వ్యాధుల పడగ

16 Oct, 2013 06:34 IST|Sakshi

ఇంద్రవెల్లి/జైనూర్/వేమనపల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని దస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోయాల్‌పాండ్రి గ్రామానికి చెందిన పుర్కా సోనుబాయి(65) జ్వరంతో బాధపడుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. సోనుబాయి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోందని, ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లి చికిత్స చేసి ఇంటికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందింది. అలాగే మండలంలోని పోచ్చంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మపూర్ గ్రామానికి చెందిన  ధడంజా దేవుబాయి(40) జ్వరంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు.  దేవుబాయి పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఆరోగ్యం కుదుటపడలేదు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందింది. దేవుబాయికి భర్త ధర్ము ఉన్నాడు. అలాగే మండలంలోని తేజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన కోట్నాక్ నాగుబాయి(45) జ్వరంతో మృతిచెందాడు. నాగుబాయి వారం రోజులుగా జర్వంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. ఆదివారం రాత్రి పిట్స్ రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందాడు.
 
 గతేడాది చిన్న కుమారుడు.. ఇప్పుడు పెద్ద కుమారుడు..
 జైపూర్ మండలం ఉశేగాం పంచాయతీ పరిధిలోని పొచ్చంలొద్ది గ్రామానికి చెందిన కుడమేత రాజుగురు(22) మంగళవారం జ్వరంతో మృతిచెందాడు. కొన్ని రోజులుగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ మంగళవారం మృత్యువాత పడ్డాడు. సార్జబాయి-కృష్ణ దంపతుల చిన్న కొడుకు ఉమాకాంత్ గతేడాది క్రితం జ్వరంతో మృతి చెందారు. ఉన్న ఒక్క కుమారుడు రాజు కూడా ప్రస్తుతం జ్వరంతో మృతి చెందడంతో తల్లి సార్జబాయి రోదనలు మిన్నంటాయి. భర్త కృష్ణ కూడా చిన్న వయసులోనే మృతిచెందడంతో సార్జబాయి దిక్కులేనది అయ్యింది. భర్త, ఇద్దరు కుమారుడు మరణించడతో ఆమె ఒంటరిది అయింది. భర్త, చిన్న కుమారుడు చనిపోయినా ధైర్యం బతుకీడుస్తూ వస్తోంది. ఈ క్రమంలో పెద్ద కుమారుడు చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడింది.
 
 వేమనపల్లి మండలంలో ఇద్దరు..
 వేమనపల్లి మండలంలో జ్వరాల బారిన పడి మంగళవారం ఇద్దరు మృతిచెందారు. జక్కెపల్లి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు ధరణి ఆకాశ్ నెల రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. వైద్యులు రూ.50వేలు ఖర్చవుతాయని, పేదరికం కారణంగా చికిత్స చేయించకపోవడంతో చనిపోయాడు. అలాగే జిల్లడ గ్రామంలో చిలుక వెంకటి(70) వృద్ధుడు పక్షం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోవడంతో మృతిచెందాడు.
 
 డయేరియాతో వృద్ధుడు..
 కాసిపేట : మండలంలోని కాసిపేట గ్రామపంచాయతీ గోండుగూడ గ్రామానికి చెందిన వృద్ధుడు కోమురం పోశం(63) ఆదివారం రాత్రి వాంతులు, విరోచనాలతో మృతిచెందాడు. ఆదివారం రెండుసార్లు వాంతులు, విరోచనాలు కావడంతో నీరసించి పోయాడు. దీంతో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఎడ్లబండిలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

మరిన్ని వార్తలు