‘ఆర్వోలను బాధ్యుల్ని చేయవద్దు’

18 Apr, 2019 18:54 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదిని ఏపీ డిప్యూటీ కలెక్టర్‌ అసోసియేషన్‌ సభ్యులు గురువారం కలిశారు. ఎన్నికల నిర్వహణలో ఆర్వోలను బాధ్యులను చేస్తూ నిర్ణయాలు తీసుకోవద్దని సీఈఓని సభ్యులు కోరారు. ద్వివేదిని కలిసిన అనంతరం కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.బాబూ రావు విలేకరులతో మాట్లాడారు. ఏపీలో ఓట్ల పోలింగ్‌ శాతం పెరగడానికి సీఈఓ ద్వివేదీ బాగా కృషి చేశారని కొనియాడారు. ఓట్లు మిస్‌ అయ్యాయని ఫిర్యాదులు లేవు..ఒత్తిడి ఉన్నా బాగా పని చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు​ చేశామని చెప్పారు.

ర్పాట్లు సరిగా లేవని కొన్ని ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన మాట నిజమేనన్నారు. కింద స్థాయి సిబ్బందిలో కొందరికి ఎన్నికల నిర్వహణా అనుభవం లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ తప్పుచేయలేదని, వాటికి ఆర్వోలను బాధ్యులు చేస్తూ చర్యలు తీసుకోవద్దని ద్వివేదీని కోరామని తెలిపారు. విచారణ చేసి ఎవరు పొరపాటు చేశారో వారిపైనే చర్యలు తీసుకోవాలని ద్వివేదిని కోరినట్లు వెల్లడించారు.

ద్వివేదీని కలసిన నూజివీడు రైతులు

వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీని నూజివీడు రైతులు కలిశారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఇవ్వకుండా టీడీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక చెక్కుల పంపిణీ అధికారులు మాత్రమే చేయాలి..కానీ టీడీపీకి ఓటు వేస్తేనే చెక్కులు ఇస్తామని నిలిపివేశారని ద్వివేదీకి నాగిరెడ్డి వివరించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా చెక్కులు ఇవ్వకుండా టీడీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని ద్వివేదీకి ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు