బదిలీ చేస్తేనేం..!

1 Mar, 2019 13:06 IST|Sakshi
బదిలీ అయినా బత్తలపల్లిలోనే విధులు నిర్వర్తిస్తున్న డీటీ సురేష్‌బాబు

 ఉన్నతాధికారుల  ఆదేశాలు బేఖాతర్‌...

బదిలీ చేసినా సీటు వదలని డిప్యూటీ తహసీల్దార్‌

నాలుగున్నరేళ్లుగా అక్కడే తిష్ట  

అధికార పార్టీ అండ పుష్కలంగా ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాలు ఎందుకు పట్టించుకోవాలనుకున్నాడో ఏమో.. బదిలీ ఉత్తర్వులు అందినా డోంట్‌కేర్‌ అంటున్నాడు ఓ అధికారి. సరేలే.. విధులన్నా సక్రమంగా నిర్వహిస్తున్నాడా అంటే అదీ లేదు.. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ..ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష సాధింపులకు దిగుతున్నాడు. ఇంతకూ ఎవరా  అధికారి అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే.

అనంతపురం, ధర్మవరం: బత్తలపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్‌ సురేష్‌బాబు పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా అక్కడే పనిచేస్తూ బదిలీపై వచ్చిన తహసీల్దార్లను ఇక్కడ పనిచేయనీయకుండా  అధికారపార్టీ నేతల అండతో   ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ బాధ్యతలను  చూస్తున్నారు. అయితే ఎన్నికల విధుల్లో భాగంగా పారదర్శకంగా వ్యవహరించాల్సిన సదరు టీటీ అధికారపార్టీ నేతల ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీకి చెందిన ఓట్ల తొలగింపు, చేర్పులకు అంగీకరించకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఎల్‌ఓలు  కొత్త ఓటు ఏది దరఖాస్తు చేసినా... టీడీపీ నాయకులను పిలిపించి, ఈ ఓటు మనకు పడుతుందా..? వాళ్లకు పడుతుందా..? అని విచారించిన తరువాతనే అంగీకారం తెలుపుతున్నట్లు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో సదరు అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన ఎన్నికల కమిషన్‌ సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ఆయన్ను పుట్టపర్తి నియోజకవర్గానికి బదిలీ చేస్తూ ఈనెల 26న అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అధికారపార్టీ నేతల అండతో ఆయన అక్కడికి వెళ్లకుండా బత్తలపల్లిలోనే డీటీగా విధులు నిర్వరిస్తున్నాడు. ఏకపక్షంగా వ్యవహరించే సదరు అధికారిని వెంటనే బదిలీ చేయాలని లేని పక్షంలో అందోళనలు చేస్తామని, ఉద్యోగులు తమ ఉద్యోగధర్మం  పాటించకుండా ఇలా అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాయడం ఏంటని ప్రతిపక్ష పార్టీ నాయకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఉన్నతాధికారులు సదరు ఉద్యోగిపై ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..

మరిన్ని వార్తలు